84 వేల ఉద్యోగాల నియామకాలకు ఆర్థికశాఖ అనుమతి

0
10

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో కొలువుల జాతరను నిరంతరంగా కొనసాగిస్తున్నది. లక్ష ఉద్యోగాల భర్తీకి వడివడిగా అడుగులు వేస్తున్నది. వివిధ రంగాల్లో నోటిఫికేషన్లు విడుదలచేస్తూ.. నిరుద్యోగుల కలలను సాకారం చేస్తున్నది. కేవలం మూడేండ్లలోనే అన్ని శాఖలకు కలిపి 84 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులిచ్చింది. అందులో 64 వేల ఉద్యోగాల భర్తీకి వివిధ రిక్రూట్‌మెంట్ బోర్డులు నోటిఫికేషన్లు జారీచేశాయి. దాదాపు 34 వేల పోస్టుల భర్తీ పూర్తయింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ), పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, సింగరేణి, విద్యుత్‌శాఖ, వైద్య, ఆరోగ్యశాఖ బోర్డుల ద్వారా వేగంగా నియామకాలు పూర్తవుతున్నాయి. గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి తాజాగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటుచేసింది.

ఇందులో టీఎస్‌పీఎస్సీదే కీలకపాత్ర. టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు 83 ఉద్యోగాల నోటిఫికేషన్లను జారీచేసింది. అందులో 30,618 ఖాళీలను నోటిఫై చేయగా.. ఇప్పటికే 11,333 ఉద్యోగాల నియామకాలు పూర్తయ్యాయి. మరో 18,714 పోస్టుల నియామకానికి పరీక్షలను నిర్వహించారు. ఫలితాలు వెలువడాల్సి ఉన్నది. గ్రూప్-2కు చెందిన 1,032 పోస్టులకు సంబంధించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతి కోసం టీఎస్‌పీఎస్సీ వేచి చూస్తున్నది. ఫలితాలు వెలువడటానికి సిద్ధమైన పోస్టుల్లో ఎనిమిదివేల వరకు టీచర్ పోస్టులున్నాయి. మరో 571 పోస్టుల నియామకాల కోసం పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధమైంది. 4,375 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతినిచ్చింది. సంబంధిత శాఖల నుంచి ఇండెంట్ కోసం అధికారులు వేచి చూస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014లో పునర్విభజన చట్టం ప్రకారం, విభజన తొలిదశలో ఏర్పడిన ప్రతిబంధకాల వల్ల మొదటి ఏడాది నియామకాలు సాధ్యం కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here