74% హెచ్-1బి వీసాలు భారతీయులకే

0
21

అమెరికా ప్రభుత్వం 2016లో జారీ చేసిన హెచ్-1బి వీసాల్లో 74.2 శాతం భారతీయ సాంకేతిక నిపుణులకే దక్కాయని, ఆ మరుసటి సంవత్సరం ఇది 75.6 శాతానికి పెరిగినట్లు ఒక ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. అయితే కొత్తగా హెచ్-1బి వీసాలు పొందిన భారతీయుల సంఖ్యలో మాత్రం తగ్గుదల ఉందని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం విడుదల చేసిన ఆ నివేదిక తెలిపింది. కాగా, హెచ్-1బి వీసాల విషయంలో చైనా 9 శాతంతో భారత్ తర్వాత రెండో స్థానంలో ఉంది. 2016లో చైనీయులు 9.3 శాతంహెచ్-1బి వీసాలు పొందితే 2017లో 9.4 శాతం మంది ఈ వీసాలు పొందారు.‘ 2017ఆర్థిక సంవత్సరంలో ఆరంభ ఉపాధికోసం నమోదు చేసుకున్న భారతీయుల సంఖ్య 4.1 శాతం తగ్గిందని, అదే సమయంలో నిరంతర ఉపాధికోసం ఆమోదించిన వారి సంఖ్య 12.5శాతం మేర పెరిగిందని ‘క్యారక్టరిస్టిక్స్ ఆఫ్ హెచ్-1బి స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్కర్స్’ పేరిట రూపొందించిన ఆ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక పలు అంశాలను వెల్లడించింది. 2016లో 70,737 మంది భారతీయులు ఆరంభ ఉపాధికోసం హెచ్-1బి వీసాలు పొందితే 2017 నాటికి ఆ సంఖ్య 67,815కు తగ్గింది. అయితే నిరంతర ఉపాధికోసం 2016లో 1,85,489 మంది వీసాలు పొందితే 2017లో ఆ సంఖ్య 2.08, 608కి పెరిగింది. మొత్తం మీద
2016లో 2,56,226 మంది భారతీయులు హెచ్-1బి వీసాలు పొందితే 2017లో ఆ సంఖ్య 2,76,425కు పెరిగినట్లు ఆ నివేదిక తెలిపింది. ఈ నివేదిక కాపీని ఏప్రిల్ 10న సెనేటర్లకు పంపగా, ఈ వారం నివేదికను బహిర్గతం చేశారు. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అమెరికాలోకి వలసల పట్ల, అలాగే హెచ్-1బి వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో హెచ్-1బి వీసాల జారీ బాగా తగ్గిపోవచ్చన్న భయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here