50 వేలకు మించి విత్‌డ్రా చేస్తే పన్ను

0
23

ఆదాయం పన్ను పరిధిలోకి రానివారు, చిన్న వ్యాపారస్తులు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే వెయ్యి రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని, అదే సమయంలో రూ.50వేలకు మించి విత్‌డ్రా చేసే సొమ్ముపై పన్ను విధించాలని డిజిటల్ చెల్లింపులపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ప్యానెల్ ప్రధాని నరేంద్రమోదీకి సిఫారసు చేసింది. ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్యానెల్ మంగళవారం ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో ప్రధాని మోదీని కలిసి.. మధ్యంతర నివేదికను సమర్పించింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ నివేదికలోని అంశాలను వివరించారు. ప్రస్తుతం ఉన్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను అన్ని డిజిటల్ చెల్లింపులకు రద్దు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. ఎండీఆర్ అనేది ఒక వ్యాపారికి డెబిట్/క్రెడిట్‌కార్డు సర్వీసులను అందించినందుకు బ్యాంకులు విధించే చార్జి. దీనిని చార్జి చేయకుండా ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను అమలు చేయాలని ముఖ్యమంత్రుల కమిటీ సూచించింది. వ్యాపారులు డిజిటల్ చెల్లింపును ఆమోదించేందుకు వారికి కొన్ని పన్ను రాయితీలు ప్రకటించాలని పేర్కొంది. ఆధార్‌పే, బయోమెట్రిక్ సెన్సర్లు వంటివాటిని 50శాతం సబ్సిడీపై వారికి అందజేయాలని సూచించింది.

అన్ని బ్యాంకుల మధ్య ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను అనుసంధానం చేయాలని పేర్కొంది. దేశంలోని 1.54 లక్షల పోస్టాఫీసులలో కూడా డిజిటల్ చెల్లింపుల కోసం తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. డిజిటల్ చెల్లింపులు జరిపేవారికి ఏడాదికి కొంత మొత్తంలో పన్ను మినహాయింపు, బీమా సదుపాయం కల్పించాలని పేర్కొంది. డిజిటల్ లావాదేవీల కారణంగా సమకూరే పొదుపు మొత్తంతో ఒక నిధిని ఏర్పాటు చేసి, గ్రామీణ, సెబీ అర్బన్ ఏరియాల్లో బ్యాంకింగ్ సదుపాయాలకు వినియోగించాలని ముఖ్యమంత్రుల కమిటీ సిఫారసు చేసింది. మెట్రో నగరాల్లోని బస్సులు, సబర్బన్ రైళ్లలో నగదు రహిత చెల్లింపులను ప్రవేశపెట్టాలని పేర్కొంది. గ్రామీణ పట్టణ సహకార బ్యాంకులు తక్షణం డిజిటల్ లావాదేవీలకు మళ్లాలని సిఫారసు చేసింది.

డిజిటల్ లావాదేవీలకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగాలంటే ప్రజలను నగదు రహిత చెల్లింపుల దిశగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రుల కమిటీ పేర్కొంది. ఈ దిశగా వారికి శిక్షణ ఇవ్వాలని సూచించింది. వ్యాపారుల వద్ద డిజిటల్ చెల్లింపులకు మెషిన్లు తగినన్ని లేకపోవడం కూడా ఒక ఆటంకంగా ఉందని తెలిపింది. డిజిటల్ చెల్లింపులకు అనువుగా ఇంటర్‌నెట్ కనెక్టివిటీ, డాటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా అభివృద్ధి చేయాలని సూచించింది. అదే సమయంలో సైబర్ భద్రతపైనా దృష్టిసారించాల్సి ఉందని పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల కోసం ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా కమిటీ అభిప్రాయపడింది. అధిక మొత్తంలో జరిగే లావీదేవీలకు నిర్దిష్టమైన పద్ధతులను రూపొందించాలని కేంద్రానికి సూచించింది. ఈ సిఫారసులు వచ్చే బడ్జెట్‌లో చోటు చేసుకునే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు.. నేను పూర్తి భరోసాతో ఉన్నాను అని చంద్రబాబు సమాధానమిచ్చారు. కరెన్సీ ముద్రణ, దాని తరలింపు, రక్షణ తదితరాలకు పెద్ద ఎత్తున వ్యయం అవుతుందని, కానీ డిజటల్ కరెన్సీకి ఆ ఖర్చు ఉండదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, సిక్కిం సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here