31న భక్త రామదాసు ప్రారంభం

0
31

తెలంగాణ ప్రభుత్వం రికార్డు సమయంలో పూర్తి చేసిన భక్తరామదాసు ప్రాజెక్టుకు ఆ మహనీయుని జయంతి అయిన జనవరి 31నాడే ప్రారంభోత్సవం జరుగనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రాజెక్టును ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. ఇదే రోజున రామదాసు సొంత గ్రామమైన నేలకొండపల్లిలో మూడు రోజుల పాటు నిర్వహించే భక్త రామదాసు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. చరిత్రలో భక్త రామదాసు జయంతి ఉత్సవాలు జరుపడం ఇదే తొలిసారి. ఈ రెండు అపూర్వ ఘట్టాలతో ఖమ్మం జిల్లా పండుగశోభను సంతరించుకుంది.

ఫలించిన సీఎం సంకల్పం..

ఖమ్మం జిల్లా పాలేరులో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి 2016 ఫిబ్రవరి16న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2017 మార్చిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని సంకల్పం తీసుకున్నారు. ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంసిద్ధం చేశారు. సీఎం ఆదేశం మేరకు మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భూసేకరణలో జాప్యం జరుగకుండా చర్యలు చేపట్టారు. పైపులైన్లు, పంప్‌హౌజ్, అప్రోచ్ చానల్, సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని సమాంతరంగా చేపట్టారు. సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని కేవలం వందరోజుల్లోనే పూర్తి చేశారు. మంత్రులు, అధికారులు, ఇంజినీర్లు, వర్కింగ్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేసి కేవలం 11 నెలల కాలంలోనే పథకాన్ని పూర్తి చేసి దేశ చరిత్రలో రికార్డు సృష్టించారు. జనవరి 23వ తేదీన ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ పంపు ద్వారా 300 క్యూసెక్కుల నీటిని కాకతీయ ఉపకాలువలోకి వదిలారు. రెండవ పంపు మోటారు పైప్‌లైన్ ట్రయల్ రన్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్త రామదాసు పేరిట నిర్మించిన ఈ ప్రాజెక్టును ఆయన పుట్టిన రోజే ప్రారంభించి జాతికి అంకితం చేయాలని సీఎం నిర్ణయించారు.

ఇది ఆదర్శం..

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని రకాల ఇబ్బందులను అధిగమించి రికార్డు సమయంలో పూర్తి చేసిన మంత్రులు, అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలను సీఎం అభినందించారు. చిత్తశుద్ధి, అంకితభావం ఉంటే ప్రాజెక్టులు అనుకున్న సమయం కంటే ముందే నిర్మించవచ్చని ఈ ప్రాజెక్టు నిరూపించిందని సీఎం అన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ప్రాజెక్టును నిర్మించి కృతజ్ఞత తెలుపుతున్నామని, ఇదేవిధంగా టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చిన రాష్ట్ర ప్రజలకోసం అన్ని ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేసి రుణం తీర్చుకుంటామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here