23,494 పోస్టులు

0
18

రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్యావిధానంలో భాగంగా నెలకొల్పుతున్న గురుకుల పాఠశాలలకు అవసరమైన 23,494 మంది ఉద్యోగులను దశలవారీగా నియమించాలని ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపిస్తున్నామని, ఇందులో అత్యుత్తమ బోధన జరుగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. ఈ నాలుగు విభాగాల్లో కొత్తగా మొత్తం 726 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించామని, ఇప్పటికే కొన్ని పాఠశాలలు మొదలయ్యాయని సీఎం తెలిపారు. ఇందుకు అనుగుణంగా స్కూళ్లలో తరగతులు పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల నియామకం జరుగాలని చెప్పారు. ప్రతి ఏడాది అవసరాన్నిబట్టి ఉద్యోగులను నియమించడానికి సీఎం అంగీకరించారు. 2017-18 విద్యాసంవత్సరానికి మొత్తం 8,245 మంది ఉద్యోగులను తక్షణం నియమించాలని ఆదేశించారు. దీనికోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని, టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీల కోసం కొత్తగా స్థాపించే 104 రెసిడెన్షియల్ స్కూళ్లలో 3,090 మంది, 30 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీల్లో 1500 మంది, ఇప్పటికే నిర్వహిస్తున్న 98 ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలో అవసరమైన 3920 మందిని, వెలుగు ప్రాజెక్టు కింద పనిచేసే 36 ఎస్సీ స్కూళ్లలో 778 మందిని, కొత్తగా స్థాపించే 51 ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 1554మందిని నియమించనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే నడుస్తున్న 65 ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 1939 మంది, కొత్తగా స్థాపించే 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 3570 మంది, ఇప్పటికే నడుస్తున్న 23 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 745 మంది, కొత్తగా స్థాపించే 118 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 4337 మంది, ఇప్పటికే ప్రారంభమైన 82 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 2063 మంది ఉద్యోగులు అవసరమని నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే నియామకాలు చేపట్టాలని సీఎం సూచించారు. మొత్తం 23,494 పోస్టులకుగాను 20,299 పోస్టులు బోధన, 3185 బోధనేతర సిబ్బందిగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లకోసం శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను నియమించడంతోపాటు, భవనాలు కూడా నిర్మించాలని, ఇందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణ, భవన నిర్మాణాలు, ఉద్యోగుల జీతాలకు బడ్జెట్ కేటాయింపులు చేస్తామని సీఎం కేసీఆర్ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here