21కే కుప్పకూల్చారు

0
30

భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తమ వరుస విజయాల
పరంపరను కొనసాగిస్తూ ఇప్పటికే ఆసియాకప్ టీ20 టోర్నీల్లో ఫైనల్లోకి అడుగుపెట్టిన టీమ్‌ఇండియా..పసికూన నేపాల్‌ను చిత్తుచిత్తుచేసింది. భారత బౌలర్ల ధాటికి నేపాల్ 21 పరుగులకే కుప్పకూలింది. జట్టులో నలుగురు బ్యాట్స్‌వుమెన్ కనీసం పరుగుల ఖాతా తెరువకుండానే నిష్క్రమించారు.

బ్యాంకాక్: ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు జోరు కొనసాగుతూనే ఉంది. తమకెదురైన ప్రత్యర్థి జట్ల భరతం పడుతున్న టీమ్‌ఇండియా..నేపాల్ జట్టును చెడుగుడు ఆడుకుంది. శుక్రవారం పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యంలోని భారత్ 99 పరుగుల తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. అంతగా అనుభవంలేని నేపాల్‌ను 21 పరుగులకే పరిమితం చేస్తూ తమ ఆఖరి లీగ్‌లో జయకేతనం ఎగురవేసింది. దీంతో అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో అత్యల్ప స్కోరు నేపాల్ పేరిట నమోదైంది. ఇక పరుగుల తేడా పరంగా టీ20ల్లో ఇది మూడో అత్యుత్తమ విజయం. భారత్ నిర్దేశించిన 121 పరుగుల లక్ష్యఛేదనలో నేపాల్ 21 పరుగులకే కుప్పకూలింది. పూనమ్ యాదవ్(3/9), పాటిల్(2/0), మేఘన(2/3)ల ధాటికి నేపాల్ జట్టులో కనీసం ఎవరూ కూడా డబుల్ డిజిట్ స్కోరు అందుకోలేకపోయారు.

జట్టులో సరితా మాగర్ చేసిన ఆరు పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా ఎక్స్‌ట్రాల రూపంలో జట్టుకు ఏడు పరుగులు జతకలువడం విశేషం. భారత్ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో పూర్తిగా విఫలమైన నేపాల్ జట్టు ఆటగాళ్లు క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్లు పెవిలియన్ బాటపట్టారు. అంతకుముందు శిఖాపాండే(39 నాటౌట్), వనిత(21) బ్యాటింగ్‌తో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 120 పరుగులు చేసింది. 29 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకున్న టీమ్‌ఇండియా..మిడిలార్డర్ బ్యాటింగ్‌తో గాడిలోపడింది. రుబీనా(2/21)కు రెండు వికెట్లు దక్కగా, మాగర్, కరుణ భండారీలకు ఒక్కో వికెట్ లభించింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో ఆకట్టుకున్న శిఖాపాండే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here