18 లక్షల ఖాతాల్లో అనుమానాస్పద సొమ్ము

0
22

పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోని ఖాతాల్లో డిపాజిట్ అయిన అనుమానాస్పద డబ్బును ఐటీ శాఖ గుర్తించింది. ఇందులో దాదాపు 18లక్షల మంది ఖాతాలు ఉన్నాయి. డిపాజిట్ చేసిన డబ్బు మీకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తూ 18 లక్షల మందికి త్వరలో ఐటీ శాఖ ఈమెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లు పంపనుంది. ఈ సమాచారం అందిన పదిరోజుల్లోపు సమాధానం పంపాల్సి ఉంటుంది. మంగళవారం కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని సీబీడీటీ ఆపరేషన్ క్లీన్ మనీని ప్రారంభించింది. రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన డబ్బును విశ్లేషించడం, సంపాదనకు, డిపాజిట్‌కు సంబంధం లేని ఖాతాలను గుర్తించి వారి నుంచి సంజాయిషీ కోరడం ఆపరేషన్ క్లీన్ మనీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సంబంధిత ఖాతాదారుల నుంచి వచ్చిన సమాధానాలను పరిశీలించి అందులో వాస్తవాన్ని గుర్తిస్తామని తెలిపారు. ఒకవేళ సమాధానాలకు, డిపాజిట్లకు మధ్య పొంతన లేకుంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ అనుమానాస్పద డిపాజిట్‌దారులకు పదిరోజుల సమయం ఇస్తామని, ఆ లోపు సమాధానాలను ఈ కమ్యూనికేషన్ ద్వారాగానీ, లేక ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఈ ఫిల్లింగ్ పోర్టల్ ద్వారాగానీ పంపాల్సి ఉంటుందని చెప్పారు. దాదాపు కోటి ఖాతాల్లో రూ.2లక్షలకు పైగా నగదు డిపాజిట్ అయినట్టు గుర్తించామని చెప్పారు. ఈ ఖాతాలను ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వద్ద ఉన్న సమాచారంతో పోల్చిచూశామని, దాదాపు 18లక్షల ఖాతాల్లో జమైన నగదు అనుమానాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here