18 ఏండ్లు నిండిన ప్రతి గొల్ల, కుర్మ వ్యక్తికీ అర్హత

0
47

గొర్రెలు కావాలని అడుగడమే తరువాయి.. రాష్ట్రంలోని గొల్ల, కుర్మలందరికీ సబ్సిడీ గొర్రెలు అందజేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గొర్రెల పెంపకానికి సిద్ధపడే 18 ఏండ్లు నిండిన ప్రతి గొల్ల, కుర్మ వ్యక్తికి ఒక గొర్రెల యూనిట్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. గొర్రెల పెంపకానికి ముందుకువచ్చే 18 ఏండ్లు పైబడినవారందరినీ సొసైటీల్లో సభ్యులుగా చేర్పించాలని కోరారు. అలాగే ఈ వర్షాకాలంలో తొలకరి జల్లులు పడిన వెంటనే గొర్రె పిల్లలు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టే గొర్రెల పెంపకం కార్యక్రమానికి మార్గదర్శకాలు రూపొందించడానికి గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతికుమారి, సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, గొర్రెలు, మాంసం అభివృద్ధి సంస్థ ఎండీ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో యాదవ, కుర్మ కుటుంబాలు నాలుగు లక్షల వరకు ఉంటాయని, మరో 50 వేలకు టుంబాలు ఎక్కువైనా సరే అందరికీ గొర్రెల యూనిట్లు కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. గొర్రెల పెంపకం కార్యక్రమానికి సంబంధించి మార్గదర్శకాలు అత్యంత పారదర్శకంగా, సులభతరంగా ఉంటేనే ఫలితాలుంటాయని చెప్పారు. కఠిన నిబంధనల వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరదని, వీలైనంత ఎక్కువ మంది లబ్ధి పొందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అడిగిన గొల్ల, కుర్మలందరికీ బ్యాంకులతో సంబంధం లేకుండా 75శాతం సబ్సిడీతో ఈ పథకాన్ని వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఇదివరలో కోరిన విధంగానే గొర్రెల పెంపకానికి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here