హోదా అడిగితే నాకు రాజకీయాలు తెలియవంటున్నారు

0
11
ప్రజా సమస్యలు పరిష్కారించడంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటారనే ఆనాడు టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చానని, ప్రచారం చేశానని అన్నారు. ఇప్పుడు హోదా అడిగితే తనకు రాజకీయాలు తెలియవంటున్నారని, అధికారంలో లేనప్పుడు ఒకలా…ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఆశలు కల్పించి, అధికారంలో వచ్చాక కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం తనకు నచ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భిన్న మతాలు, కులాలను గౌరవించకుండా ప్రభుత్వాలను నడపలేరని అన్నారు.
ఇక్కడ అవకాశవాద రాజకీయాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని, బీజేపీ ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు పోతోందని పవన్ విమర్శించారు. ఎవరి మాట వినకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆనాడు మద్దతు ఇచ్చినప్పుడు తనకు రాజకీయ అనుభవం ఉందా అని అప్పట్లో బీజేపీ నేతలు ఎవరూ తనను అడగలేదని, ఇప్పుడు మాత్రం సిద్ధార్థ నాథ్ సింగ్ వంటి వారు ప్రశ్నిస్తున్నారని పవన్ దుయ్యబట్టారు. రెండురాష్ట్రాలు విడిపోవడానికి కారణం యువతేనని, రెండు రాష్ట్రాల యువతకు న్యాయం జరగాలని అన్నారు.

LEAVE A REPLY