సౌరవిద్యుత్‌ ఫలకాల దిగుమతిలో వెసులుబాటు

0
21

సౌర విద్యుత్‌ ఫలకాల దిగుమతి విషయంలో చట్ట నిబంధనలు సవరించాలని ఈ ఫలకాల తయారీ సంస్థ యాజమాన్యం అదానీ గ్రూప్‌ ప్రభుత్వం వద్ద లాబీయింగ్‌ మొదలుపెట్టింది. సౌర ఫలకాల దిగుమతులపై రక్షణ సుంకాన్ని విధిస్తే అది ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌)లకు సంబంధించిన నియమ నిబంధనలను తుంగలో తొక్కినట్లవుతుందని సౌర ఫలకాల తయారీ పరిశ్రమల రంగం వాదిస్తోంది. చైనా నుంచి చౌక ధరలకు సౌర విద్యుత్‌ పరికరాలను దిగుమతి చేసుకుంటే దేశీయంగా భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలను కోల్పోతామని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించటంతో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకున్నది. సౌర విద్యుత్‌ బ్యాటరీలు, ఇతర పరికరాల దిగుమతులపై 25 శాతం రక్షణ సుంకం విధించాలని కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ జులై 16న విడుదల చేసిన నివేదికలో ప్రతిపాదించింది. అదానీ గ్రూప్‌కుచెందిన ముంద్రా సోలార్‌ పీవీ సంస్థ నేతృత్వంలో భారత సౌరవిద్యుత్‌ పరిశ్రమల సమాఖ్య దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ ఈ ప్రతిపాదన చేసింది. చైనా, మలేసియాల నుంచి చౌకధరలకు సౌర విద్యుత్‌ పరికరాలను దిగుమతి చేసుకుంటుండటంతో తాము భారీ నష్టాలను చవిచూస్తున్నామని సౌర విద్యుత్‌ పరిశ్రమల సమాఖ్య చెబుతోంది. ఈ సంస్థల వాదనను పరిగణనలోకి తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన వీరికి విజయమే అయినప్పటికీ సెజ్‌లలో వున్న సౌర విద్యుత్‌ పరికరాల తయారీ సంస్థలకు ప్రత్యేక పన్ను మినహాయింపునివ్వాలా వద్దాఅన్న అంశంపై ప్రభుత్వం ఇంకా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వుండటంతో ఈ విజయం ఇంకా కొద్ది దూరంగానే వుందని చెప్పక తప్పదు. 2005 నాటి సెజ్‌ల చట్టం ప్రకారం ఈ సంస్థలు దేశీయంగా విక్రయించే సౌరవిద్యుత్‌ పరికరాలకు ఈ రక్షణ సుంకం వర్తిస్తుంది. అయితే దీని వల్ల ధరలు 25 శాతం మేర పెరుగుతాయన్న ఫిర్యాదు ప్రయోజనాన్ని పూర్వపక్షం చేస్తోంది. అంటే సౌర విద్యుత్‌ పరికరాల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించుకుని విక్రయించుకోవాల్సి వుంటుంది. తద్వారా వీటి లాభాలకు గండిపడుతుంది. ఈ నేపథ్యంలో సౌరవిద్యుత్‌ పరికరాల తయారీ సంస్థల లాబీ తమకు ఈ రక్షణ సుంకం చెల్లింపు నుండి మినహాయింపు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇందుకు సంబంధించి సెజ్‌ల నియమనిబంధనలను పునర్నిర్వచించాలని ఈ పరిశ్రమ లాబీ పట్టుపడుతోంది. ఇతర దేశాల నుంచి చౌక ధరలకు సౌర విద్యుత్‌ పరికరాలు దిగుమతి చేసుకుంటే మన దేశంలో దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కోల్పోతామని పార్లమెంటరీ స్థాయీ సంఘం తన నివేదికలో పేర్కొంది. దీనితో ఈ సుంకం విధించాలా వద్దా? అన్న అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఆర్థికశాఖ కావటంతో అందరి దృష్టీ ఆర్థికశాఖవైపు మళ్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here