సూపర్‌స్టార్‌తో కరుణాస్‌ ఆకస్మిక భేటీ

0
12

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో గుణచిత్ర నటుడు, తిరువాడనై శాసనసభ్యుడు కరుణాస్‌ గురువారం ఆకస్మికంగా భేటీ అయ్యారు. శశికళ శిబిరానికి చెందిన ఆయన భేటీతో తమిళ రాజకీయాల్లో సరికొత్త ఆలోచనలు మొదలయ్యాయి. చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని రజనీకాంత్‌ నివాసానికి కరుణాస్‌ గురువారం వెళ్లారు. సుమారు అరగంట సేపు రజనీకాంత్‌తో సమావేశమయ్యారు. ఇప్పటికే రజనీకాంత్‌ను భాజపా తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని, ఆయన కూడా రాజకీయ ప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శశికళ శిబిరానికి చెందిన కరుణాస్‌ భేటీతో తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అంచనాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా కరుణాస్‌ విలేకరులతో మాట్లాడుతూ రజనీకాంత్‌ హీరోగా నటించిన బాషా చిత్రం డిజిటలైజ్‌ చేసిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని తెలిపారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని, ఇందులో తమిళనాడు ప్రస్తుత రాజకీయాల గురించి ప్రస్తావించలేదని తెలిపారు. రజనీకాంత్‌ అంటే తనకు చాలా ఇష్టమని, తనంటే ఆయనకూ అభిమానమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు, తన కుటుంబానికి కొన్ని హితోపదేశాలు చేశారని తెలిపారు. జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ న్యాయవిచారణ కోరడం అర్థరహితమన్నారు. ఇది ప్రజలను మోసపుచ్చే చర్య అని విమర్శించారు. ‘అమ్మ’ పాలన కాపాడాలని, ‘అమ్మ’ పథకాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY