సుస్థిర శాంతికి యోగానే మార్గం

0
78

ఉగ్రవాదం, వాతావరణ మార్పులనే రెండు సవాళ్లకు శాశ్వత పరిష్కారం కోసం ప్రపంచం భారత్‌ వైపు, యోగా వైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం ప్రయత్నిస్తున్న తరుణంలో యోగా అత్యధిక ప్రాధాన్యం సంతరించుకొందని, ఎందుకంటే సుస్థిర శాంతికి ఇదే మార్గమని తెలిపారు. ‘‘యోగా కేవలం వ్యాయామమే కాదు. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక వికాసంతో శాంతి సాధనకు ఇదో మార్గం’’ అన్నారు. యోగా సామరస్యాన్ని తీసుకొస్తుందని తెలిపారు. యోగా ఒక కొత్త యుగాన్ని ఆవిష్కరింపజేయగలదన్నారు. ఉత్తరాఖండ్‌ రుషికేశ్‌లో గంగా నది ఒడ్డున ఉన్న పరమార్థ నికేతన్‌ ఆశ్రమంలో వార్షిక అంతర్జాతీయ యోగా ఉత్సవంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రసంగించారు. ఇటీవల ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తలకు, మరికొన్ని అసాధారణ విజయాలను సాధించిన ఇతర శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. మన దేశంలో శాస్త్ర, పరిజ్ఞాన అన్వేషణతోపాటు ఆత్మాన్వేషణననూ నమ్ముతామని చెప్పారు. ‘‘ప్రాచీనకాలంలో ప్రపంచం నలుమూలలకు చెందిన రుషులు, మేధావులు రుషికేశ్‌ కేంద్రంగానే శాంతి కోసం అన్వేషణ సాగించారు. అంతర్జాతీయ యోగా ఉత్సవ నిర్వహణకు ఇదే సరైన వేదిక’’ అని తెలిపారు. ఈ వార్షిక కార్యక్రమం నిర్వహణపై ఆశ్రమం అధిపతి స్వామి చిదానంద సరస్వతిని అభినందించారు. భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వంలో యోగా భాగమని ప్రధాని పేర్కొన్నారు. ‘‘యోగా మనిషిని ప్రకృతికి చేరువ చేస్తుంది. శరీరానికి, మనసుకు క్రమశిక్షణ అలవరుస్తుంది. యోగాను సుదీర్ఘకాలం సాధన చేస్తే ఆధ్యాత్మిక ఉచ్ఛస్థితికి చేరుకోవచ్చు. ‘నేను’, ‘మేము’ అనే ఆలోచనలు తొలగిపోయి ‘మనం’ అనే ఒకే భావన ఆ స్థితిలో ఉంటుంది’’ అని వివరించారు.

క్రమశిక్షణాయుత జీవితాన్ని గడపడాన్ని, మానవజాతి ఉమ్మడి శ్రేయస్సు కోసం పనిచేయడాన్ని యోగా లాంటి ప్రాచీన విధానం ప్రపంచానికి నేర్పించగలదని జర్మనీ మేధావి మాక్స్‌ ముల్లర్‌ను ఉటంకిస్తూ ప్రధాని చెప్పారు. శరీరం మనసుతో ఏకత్వాన్ని సాధించేందుకు, మనిషి సమాజంతో ఏకత్వాన్ని సాధించేందుకు యోగా తోడ్పడుతుందని స్వామి వివేకానంద చెప్పారని తెలిపారు. యోగా ఏకత్వాన్ని సాధించే కళ అని పేర్కొన్నారు. వారం రోజుల ఈ ఉత్సవంలో అనేక దేశాల నుంచి యోగా సాధకులు, నిపుణులు పాల్గొంటున్నారు.

క్షిపణి పరీక్ష విజయంపై అభినందనలు
తక్కువ ఎత్తులో వచ్చే ఏ శత్రు క్షిపణినైనా ధ్వంసం చేసే సామర్థ్యమున్న స్వదేశీ సూపర్‌సోనిక్‌ క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించడంపై రక్షణ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ‘ట్విటర్‌’లో అభినందనలు తెలిపారు. ఈ విజయంతో ఇలాంటి సామర్థ్యమున్న ఐదు దేశాల సరసన భారత్‌ నిలిచిందని, ఇది దేశమంతా గర్వించాల్సిన విషయమని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here