సీఎం సూచనలతో వైద్యసేవలు విస్తృతం: మంత్రి లకా్ష్మరెడ్డి

0
19

రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పర్యాద కృష్ణమూర్తి మంగళవారం టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ కార్యాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, శాప్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ వేణుగోపాల్‌రావు, తెలంగాణ టీజీవో వైద్యవిభాగం అధ్యక్షుడు జూపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం సూచనలతో వైద్యసేవలు విస్తృతం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచనలతో వైద్యరంగాన్ని బాగు చేస్తున్నామని, వైద్యసేవలను విస్తృతం చేశామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి తెలిపారు. మంగళవారం టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో లకా్ష్మరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. దవాఖానల్లో అన్ని వసతులను కల్పించి, రోగులకు నాణ్యమైన మందులను అందిస్తున్నామన్నారు. వైద్య పరికరాల కొనుగోలు పారదర్శకంగా చేపడుతున్నామని చెప్పారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరుగుతున్నదని, రాష్ట్రం ఏర్పాటు తరువాత ప్రభుత్వ దవాఖానల్లో చేరే రోగుల సంఖ్య 20శాతం పెరిగిందన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అందజేసే జాతీయ అవార్డు కూడా దక్కిందని పేర్కొన్నారు. పర్యాదతో కలిసి టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ లకా్ష్మరెడ్డికి తోడుగా పర్యాద సేవలు వైద్య రంగానికి ఉపయోగపడాలన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పర్యాద మర్యాద కలిగిన మనిషి అని, ఆయన సేవలు పార్టీకే కాకుండా ఇక నుంచి ప్రభుత్వానికి కూడా అందుతాయన్నారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్న వాళ్లందరికీ మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here