సీఎంను టచ్‌ చేస్తున్నావ్‌!

0
17
‘‘ఖబడ్దార్‌… ఒక ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావు నువ్వు! ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తున్నావ్‌! తర్వాత నీపరిస్థితి ఇలా ఉండదు!’’… విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పోలీసు అధికారులకు చేసిన హెచ్చరికలివి! ‘‘బుద్ధుందా, ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో అర్థమవుతోందా? ఇంకా రెండే రెండు సంవత్సరాలు! అందరినీ గుర్తుపెట్టుకుంటాను. ఎవ్వరినీ మరిచిపోను!’’ అని తీవ్రహెచ్చరికలు జారీ చేశారు. ‘హోదా’ ఆందోళనలో పాల్గొనేందుకు గురువారం విశాఖకు వచ్చిన తనను విమానాశ్రయంలో అడ్డుకోవడంతో జగన్‌ ఆగ్రహానికి గురయ్యారు.
తననుతాను ‘ముఖ్యమంత్రి’గా చెప్పుకొన్నారు. ఎంపీలు సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డితోపాటు అంబటి రాంబాబు,ఇతర నేతలతో స్పైస్‌జెట్‌ విమానంలో సాయంత్రం 4 గంటలకు జగన్‌ విశాఖ చేరుకున్నారు. అప్పటికే పోలీసులు అక్కడ ఉన్నారు. నగరంలోకి అనుమతించలేమంటూ వారిని అడ్డుకున్నారు. దీంతో జగన్‌, పార్టీ నాయకులతో కలిసి రన్‌వేపైనే బైఠాయించారు. అరగంట తర్వాత… అక్కడి నుంచి లాంజ్‌ వైపు కదిలారు. పోలీసులు, మఫ్టీలో ఉన్న సిబ్బంది వారిని అడ్డుకున్నారు. పక్కకు రావాలంటూ అంబటిని, మరికొందరిని కోరారు. ‘మీరెవరు’ అంటూ అంబటి నిలదీశారు. సాయిరెడ్డి కూడా అదేవిధంగా ప్రశ్నించారు.
‘ప్రభుత్వాలు శాశ్వతం కాదు. చంద్రబాబు శాశ్వతం కాదు’ అని అంబటి హెచ్చరించారు. గుర్తింపు కార్డు చూపాలని సాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈక్రమంలో వాగ్వాదం,తోపులాట చోటు చేసుకున్నాయి. పోలీసులను సాయిరెడ్డి నెట్టేయడం కనిపించింది. యూనిఫాం లేదు, ఐడీకార్డులూ లేవు, పోలీసులా, చంద్రబాబు గూండాలా…అని కొందరు అనడం వినిపించింది. ఒక దశలో… అంబటి రాంబాబు ‘రేయ్‌ కొడతా నిన్ను పట్టుకుని’ అని ఒక పోలీసును హెచ్చరించారు. ఈ క్రమంలోనే జగన్‌… ‘‘ముఖ్యమంత్రిని అడ్డుకుంటున్నావ్‌ నువ్వు. ఇక రెండే సంవత్సరాలు. అందరినీ గుర్తు పెట్టుకుంటాను’’ అని పోలీసులను హెచ్చరించారు. ‘నిన్ను డెఫినెట్‌గా మరిచిపోను’ అని సాయిరెడ్డి కూడా ఒక అధికారిని హెచ్చరించారు. ఇదంతా జరుగుతుండగానే జగన్‌ బృందంలోని కొందరిని పోలీసులు పక్కకు తీసుకెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here