సమాజహితం కోసం పనిచేయాలి

0
18

ఉపాధ్యాయ సంఘాలు సర్కారు బడులను బలోపేతం చేస్తూ సమాజహితం కోసం పనిచేయాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రం సిరిసిల్లలోని వాసవీ కల్యాణ మండపంలో రెండు రోజుల పాటు జరుగనున్న తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) రాష్ట్ర విద్యామహాసభలను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదిలో నిక్షిప్తమై ఉందన్నారు.

ఒక్కో విద్యార్థిపై రూ.50 వేల వరకు ఖర్చుపెట్టి ప్రైవేట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివించేందుకు తల్లిదండ్రుల చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని తన ఎజెండాగా మలుచుకున్నదని, రాష్ట్రంలో విద్యాప్రమాణాలు పెంచేందుకు రాజీలేని కృషి చేస్తున్నదని చెప్పారు. విద్యను నిర్లక్ష్యం చేయవద్దన్న ఉద్దేశంతో 119 బీసీ రెసిడెన్సియల్, 200 మైనార్టీ స్కూళ్లు, అనేక ఎస్సీ, ఎస్టీ స్కూళ్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఉమ్మడి జిల్లాల్లో రూ.80 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో టీటీఎఫ్ చేసిన ఉద్యమాలు అభినందనీయమన్నారు. సిరిసిల్లలోనే ఆవిర్భవించిన టీటీఎఫ్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని జడ్పీ చైర్మన్ తుల ఉమ కొనియాడారు. కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, టీటీఎఫ్ వ్వవస్థాపక అధ్యక్షుడు తోట హనుమాన్లు, పాతూరి మహేందర్‌రెడ్డి, బంటు ఆనంద్, పంజాల వెంకటేశ్వర్లు, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here