సంపూర్ణ గోవధ నిషేధానికి ఆదేశించలేం

0
26

గోవధను సంపూర్ణంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గోవధను సంపూర్ణంగా నిషేధించాలని లేదా వధ, స్మగింగ్‌కు గురికాకుండా పశువులను రక్షించేందుకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని కోరుతూ ఢిల్లీ వాసి వినీత్ సహాయి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. గోవధ, పశువుల రవాణాపై వేర్వేరు రాష్ర్టాలు భిన్నమైన విధానాలు అనుసరిస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో గట్టి చట్టాలు ఉన్నప్పటికీ కేరళలో పశువుల వధను అనుమతిస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా రాష్ర్టాల మధ్య పశువుల అక్రమ రవాణా సాగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో పశువుల రక్షణ, గోవధ నిషేధంపై దేశం మొత్తం ఒకే విధానం అనుసరించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అయితే, పశువుల వధను నిషేధిస్తూ చట్టాన్ని రూపొందించాలని తాము రాష్ర్టాలను ఆదేశించలేమని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖెహర్, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వారి చట్టాల్లో తాము జోక్యం చేసుకోబోమని తెలిపింది. పశువుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలోనే సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. పశువులను రాష్ర్టాల మధ్య, దేశాల మధ్య అక్రమంగా రవాణా చేస్తున్నారన్న మరొక పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఇటువంటివాటిని నిరోధించేందుకు నిబంధనలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. నేపాల్‌లో ఐదేండ్లకోసారి జరిగే గధిమాయి ఉత్సవాలకు భారత్ నుంచి పెద్ద సంఖ్యలో పశువులను రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌లో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here