సంక్షేమానికి ఆధార్ తప్పనిసరి చేయొద్దు

0
25

ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలకు ఆధార్‌కార్డును తప్పనిసరి చేయవద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టంచేసింది. ఈ విషయమై దాఖలైన పిటిషన్లపై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. బ్యాంకులో ఖాతాలు తెరువడం, ఆదాయం పన్ను వివరాల నమోదు వంటి వాటికి ఆధార్‌కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేయవచ్చు కానీ, అన్నింటికీ ఆ నిబంధన వర్తింపజేయవద్దని సూచించింది. ఆధార్ అనుసంధానంపై పిటిషన్లను విచారించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన బెంచ్ ఏర్పాటు అవసరమని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యంకావడం లేదని పేర్కొంది. ఈ ఏడాది చివరినాటికి ఆధార్‌తో అనుసంధానంలేని పాన్‌కార్డును అర్హతలేనిగా ప్రకటిస్తామని కేంద్రం స్పష్టంచేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి, మధ్యాహ్న భోజన పథకానికి ఆధార్‌ను లింకు చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఆధార్‌కార్డులు జారీకానందున ప్రభుత్వ పథకాలు తమకు అందవనే భయాందోళనలు లబ్ధిదారుల్లో నెలకొన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో వారికి ఉపశమనం లభించినట్టయింది. ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయవద్దని నాలుగేండ్ల క్రితం మధ్యంతర ఉత్తర్వులో కూడా సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here