శ్రీని, ఠాకూర్‌ కలిసిపోయారు

0
29

బీసీసీఐ ఒకప్పటి అధ్యక్షుడు శ్రీనివాసన్‌, ఈ మధ్యే ఆ పదవి నుంచి దిగిపోయిన అనురాగ్‌ ఠాకూర్‌ల మధ్య వైరం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. శ్రీనివాసన్‌ పదవీచ్యుతుడయ్యాక అతడికి, ఠాకూర్‌కు వైరం మొదలై.. ఓ దశలో అది తీవ్ర స్థాయికి చేరింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధమూ సాగింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఠాకూర్‌.. శ్రీనివాసన్‌ను ఇబ్బంది పెట్టేలా కొన్ని చర్యలూ చేపట్టాడు. ఐతే ఇప్పుడు ఠాకూర్‌ కూడా పదవి కోల్పోయాడు. శ్రీనివాసన్‌ లాగే ఠాకూర్‌ కూడా లోధా కమిటీ దెబ్బకు పదవీచ్యుతుడైనవాడే. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ చేతులు కలపడం విశేషం. బీసీసీఐతో పాటు రాష్ట్రాల క్రికెట్‌ సంఘాల్లోనూ లోధా కమిటీ ప్రతిపాదనల అమలుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో వీళ్లిద్దరూ శనివారం బెంగళూరులో సమావేశమయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఏం చేయాలో వీళ్లిద్దరూ చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఠాకూర్‌తో పాటు సుప్రీం కోర్టు వేటుకు గురైన బోర్డు మాజీ కార్యదర్శి అజయ్‌ షిర్కే.. సంయుక్త కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, కోశాధికారి అనిరుధ్‌ చౌదరి, ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా కూడా హాజరైనట్లు సమాచారం. 24 రాష్ట్రాల క్రికెట్‌ సంఘాల ప్రతినిధులూ ఈ సమావేశంలో పాల్గొన్నారు! ఈ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి.. భారత జట్టు ఆడాల్సిన మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వలేమని చెప్పడం ద్వారా లోధా కమిటీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరిగినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ నెల 19న సుప్రీం కోర్టు బీసీసీఐకి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో తదనంతర పరిణామాలపై ఏం చేయాలో కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here