శ్రీకాకుళం వాసికి మూడో ర్యాంకు తెలుగులో మెరిసిన ఆణిముత్యం

0
30

వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన ఆ కుర్రాడు చిన్నతనం నుంచి అమ్మానాన్నల కష్టాన్ని చూస్తూ పెరిగాడు. జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలనే సంకల్పంతో పగలూరాత్రీ తేడాలేకుండా కష్టపడి చదివాడు. తెలుగు మాధ్యమంలోనే చదివి ఎట్టకేలకు తన కల నిజం చేసుకున్నాడు. తనలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తూ సివిల్స్‌లో జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించాడు. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణ. శ్రీకాకుళం జిల్లా పలాస పురపాలక సంఘం ఆరో వార్డులోని పారసంబ గ్రామానికి చెందిన గోపాలకృష్ణ తల్లిదండ్రులు అప్పారావు, రుక్మిణి ఇద్దరు వ్యవసాయ కూలీలే. వీరి కష్టాన్ని చూసి జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్లాలని చిన్నతనంలోనే గోపాలకృష్ణ నిర్ణయించుకున్నారు. ఆయన ప్రస్తుతం పలాసలోని రేగులపాడు ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జీవితంలో మరింత ఉన్నతస్థానానికి వెళ్లాలని, అందరిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే బలమైన కోరికతో సివిల్స్‌కు సిద్ధమయ్యారు. మూడుసార్లు సివిల్స్‌లో విఫలమైనా పట్టువదలకుండా నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. పారసంబలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదువరకు గోపాలకృష్ణ విద్యాభ్యాసం కొనసాగింది. ఆరు నుంచి పది తరగతులు బ్రాహ్మణపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్‌లో చదివారు. ఇంటర్‌ పలాసలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, డిగ్రీ ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యావిధానం ద్వారా బీఎస్సీ పూర్తిచేశారు.2006 డీఎస్సీకి ఎంపికై ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. సివిల్స్‌లో తెలుగు లిటరేచర్‌ను ఆప్షనల్‌గా ఎంచుకుని విజయం సాధించారు. తెలుగులో సివిల్స్‌రాసి విజయం సాధించడం అసాధ్యం అనే మాటను సుసాధ్యం చేశారు. తెలుగులోనే మెయిన్స్‌ రాసి, ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే పూర్తి చేసి విజయం సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here