వైట్‌హౌస్ సీనియర్ సలహాదారునిగా ట్రంప్ అల్లుడు కుష్నీర్

0
27

అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అల్లుడు జరీద్ కుష్నీర్ (35)ను వైట్‌హౌస్‌లో సీనియర్ సలహాదారుడిగా మంగళవారం నియమించారు. వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కుష్నీర్ రాజకీయాల్లో కూడా రాణిస్తారని ట్రంప్ విశ్వాసం వ్యక్తంచేశారు. కుష్నీర్ తన బృందంలో చేరడం గర్వంగా ఉందని ట్రంప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్ బృందంలో సీనియర్ సలహాదారుడిగా కుష్నీర్ నియామకాన్ని వైట్‌హౌస్ ముఖ్య అధికారి రీన్స్ ప్రీబస్ స్వాగతించారు. ఏదైనా ఒక సమస్యపై ముందుచూపు, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం అతనికి ఉన్నదని తెలిపారు. వ్యాపార నిర్వహణలో అతని వ్యవహారశైలి గొప్పదని, బహిరంగంగా మాట్లాడడం కుష్నీర్ నైజమని పేర్కొన్నారు. వైట్‌హౌస్ బృందంలో కుష్నీర్ నియామకానికి సంబంధించి చట్ట సంబంధ సమస్యలు ఉత్పన్నం కావని తెలిపారు. 1967 బంధుప్రీతి చట్టం అమెరికా అధ్యక్షుడి సిబ్బందికి వర్తించదని ఆయన స్పష్టంచేశారు. ట్రంప్ కూతురు ఇవాంక భర్త కుష్నీర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here