వైభవంగా ముగిసిన విశాఖ ఉత్సవ్‌

0
18

ఎంతో ఆర్భాటంగా శుక్రవారం ప్రారంభమైన విశాఖ ఉత్సవ్‌ ఆదివారం రాత్రి అంతే వైభవంగా ముగిసింది. మూడు రోజులపాటు విశాఖలోని నొవొటెల్‌ హోటల్‌ నుంచి వుడా పార్కు మధ్య దాదాపు 2 కిలో మీటర్ల పొడవునా రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఈ ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. ఆదివారం కావడంతో చివరి రోజు ఉత్సవాలకు నగర ప్రజలు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల నుంచే విశాఖలోని తీర ప్రాంతం ప్రజలతో సందడిగా మారింది. వుడా పార్కులో నిర్వహించిన పుష్ప ప్రదర్శనకు మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆర్కేబీచ్‌లోని ప్రధాన వేదిక, నొవొటెల్‌ హోటల్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన మరో వేదికపై నుంచి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన అనేకమంది కళాకారులు ప్రదర్శనలిచ్చి సందర్శకులను అలరించారు. ఉత్తరాంధ్రలోని ప్రసిద్ధ నమూనా ఆలయాలను ఆదివారం భారీగా ప్రజలు సందర్శించారు. పిల్లలు, పెద్దలకు ఆర్కేబీచ్‌లో వివిధ రకాలైన పోటీలను నిర్వహించి విజేతలకు జిల్లా యంత్రాంగం బహుమతులు అందజేసింది. విశాఖ ఉత్సవ్‌ నిర్వహణపై మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్న మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు, ఆయన అనుచర ఎమ్మెల్యేలు వేడుకలకు హాజరు కాలేదు.

LEAVE A REPLY