విపక్షాలకు వెరువం.. అభివృద్ధిని వీడం

0
21

ప్రతిపక్ష పార్టీల బెదిరింపులకు వెరువకుండా రాష్ట్ర అభివృద్ధిని కొనసాగిస్తామని రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టంచేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా చారిత్రక ఎలగందుల గ్రామానికి వెళ్లేందుకు రూ.60 కోట్లతో చేపట్టిన రహదారి పునర్నిర్మాణం, మానేరుపరీవాహక ప్రాంతంలో వంతెన నిర్మాణానికి ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో తుమ్మల మాట్లాడారు. రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూస్తే ప్రతిపక్ష నేతల కాళ్లకింద భూమి కదులుతున్నదన్నారు. విపక్షాలు అడుగడుగునా అభివృద్ధికి ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తమ ప్రభుత్వం అన్ని అడ్డంకులను అధిగమిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నదన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని, తీరా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి చేయడం వీళ్ల వల్లకాదని చెప్పుకొచ్చిన కొన్ని రాజకీయ పార్టీల అంచనాలు తలకిందులయ్యేలా ఇప్పుడు అభివృద్ధి చేసి చూపిస్తున్నామని చెప్పారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను మరుగున పడేసిన సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిన ఎలగందుల ఖిలాను అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలో భాగంగా ఈ ఖిలాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here