వినువీధుల్లో విధ్వంసక విజయం

0
19

శత్రు క్షిపణులను ఆకాశంలోనే అడ్డుకునే అధునాతన ఏరియా రక్షణ (ఏఏడీ) విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని అబ్దుల్‌కలాం ద్వీపం (ప్రయోగకేంద్రం) నుంచి బుధవారం ఉదయం 10.15 గంటలకు ఈ క్షిపణిని ప్రయోగించామని, నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించిందని, ప్రయోగం విజయవంతమైందని రక్షణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశంలో గరిష్ఠంగా 15 కి.మీ. ఎత్తువరకు శత్రు క్షిపణులను ఛేదించడం మన క్షిపణి ప్రత్యేకత అని డీఆర్డీవో అధికారులు తెలిపారు.

ఇలా ప్రయోగించి..

అడ్వాన్స్‌డ్ ఏరియా డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ మిసైల్‌గా పిలిచే ఈ క్షిపణి తన ప్రయోగంలో నిర్దిష్ట లక్ష్యాన్ని ధ్వంసం చేసిందని డీఆర్డీవో అధికారులు తెలిపారు. ప్రయోగకేంద్రంలోని ఆయుధ వ్యవస్థ రాడార్ ద్వారా శత్రు క్షిపణికి సంబంధించిన సమాచారాన్ని ఈ విధ్వంసక క్షిపణికి చేరవేశామని, నిర్దిష్ట లక్ష్యం ప్రకారమే శత్రు క్షిపణిని ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. పరారుణ కిరణాల ఆధారంగా ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్ ద్వారా ఈ మొత్తం ప్రక్రియను కేంద్రం నుంచి వీక్షించామని, టెలిమెట్రీ వ్యవస్థ సాయంతో ఆకాశంలో శత్రు క్షిపణిని గుర్తించడం మొదలు పూర్తిగా ధ్వంసం చేసేవరకు పరిశీలించామని తెలిపారు. ఈ క్షిపణి విజయం సాధించడం ద్వారా మనదేశ బాలిస్టిక్ మిసైల్ రక్షణవ్యవస్థ గొప్పదనం మరోసారి వెల్లడైందని పేర్కొన్నారు.

ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ సంతృప్తి వ్యక్తం చేసి.. డీఆర్డీవో సిబ్బందికి, శాస్త్రవేత్తలకు, ప్రాజెక్టు అధికారులకు అభినందనలు తెలియజేశారని చెప్పారు. ఈ నూతన ఆవిష్కరణ విజయవంతం కావడంపై డీఆర్డీవో చైర్మన్, రక్షణశాఖ కార్యదర్శి క్రిస్టోఫర్ కూడా అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. క్షిపణి-వ్యూహాత్మక వ్యవస్థ డైరెక్టర్ జనరల్, రక్షణశాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు సతీశ్‌రెడ్డి తన సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి స్వయంగా క్షిపణి ప్రయోగాన్ని వీక్షించారు.

LEAVE A REPLY