విద్యుత్ ఉద్యోగులను కాపాడుకుంటాం

0
28

మానవీయ కోణంంలో ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఉద్యోగులు సంతోషంగా పనిచేసుకోవాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు. బంగారు తెలంగాణ సాధనలో 24 గంటలు శ్రమిస్తున్న విద్యుత్ ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం నుంచి అటెండర్ వరకు అంతా వారివారి పాత్రలను గొప్పగా పోషించాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ :విద్యుత్ ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఉద్యోగులకు కడుపునిండా అన్నం పెట్టాలి.. సంతోషంగా పనిచేసుకోనివ్వాలి అనేదే తమ విధానమని చెప్పారు. రాష్ర్టాభివృద్ధిలో విద్యుత్ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో విద్యుత్తు మీద అనేక మంది రకరకాల అపోహలు సృష్టిస్తే దాన్ని పటాపంచలు చేశారని ప్రశంసించారు. మానవీయ కోణంలో ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సిద్ధమని, ఇందుకోసం పకడ్బందీ విధానం రూపొందించాలని యూనియన్ నేతలకు సీఎం సూచించారు. ప్రభుత్వంతో ఉద్యోగులు కొట్లాడడం సహజమేనని, అయితే ఒకటికి పదిసార్లు చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలే తప్ప పని బంద్‌పెడుతం అనటం సరికాదన్నారు. రాష్ట్రం ఇపుడిపుడే అభివృద్దిపథంలో దూసుకుపోతున్నదని, అధికారంలో ఏ పార్టీ ఉన్నా లేకున్నా రాష్ట్రం శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను దశలవారీగా రెగ్యులరైజ్ చేయాలని సీఎం విద్యుత్ శాఖకు సూచించిన నేపథ్యంలో సోమవారం 1104, 327, టీఆర్‌వీకేఎస్, ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీ తదితర సంఘాలు నేతలు సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగనేతలనుద్దేశించి సీఎం ప్రసంగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here