విద్యాభివృద్ధికి విప్లవాత్మక చర్యలు

0
17

కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో యువత ఆన్‌లైన్ ద్వారా విద్య, పఠనం, కొనసాగించేందుకు స్వయం వేదికను ఏర్పాటుచేశారు. దీనిద్వారా విద్యార్థులకు ప్రయోగాత్మకంగా 350 కోర్సులను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు. అత్యుత్తమ బోధనా సిబ్బంది, ఉత్తమ పాఠ్యవనరులు, చర్చావేదికల్లో పాల్గొనడం, పరీక్షలు రావడం వంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యాప్రసారాలను డీటీహెచ్‌లతో అనుసంధానం చేసి స్వయంను మరింత విస్తరిస్తారు. ఇకపై ఉన్నత విద్యాసంస్థలు జాతీయస్థాయిలో చేపట్టే ప్రతి ప్రవేశపరీక్షను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా నిర్వహిస్తారు. ఎంట్రెస్‌ల నుంచి సీబీఎస్‌ఈ, ఏఐసీటీవంటి విద్యాసంస్థలకు విముక్తి కల్పిస్తారు. అవి నాణ్యతమైన విద్యాబోధనపై మరింతగా దృష్టిసారించేలా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే 60కిపైగా జిల్లాల్లో ఉన్న ప్రధాన మంత్రి కౌసల్ కేంద్రాలను దేశవ్యాప్తంగా 600 జిల్లాలకు విస్తరిస్తారు. వంద అంతర్జాతీయ నైపుణ్యకేంద్రాలు ఏర్పాటుచేస్తారు. వీటి ద్వారా ఆధునిక శిక్షణ ఇవ్వడంతోపాటు విదేశీభాషల్లో విద్యాబోధన కొనసాగిస్తారు. శిక్షణ పొందిన యువకులు అంతర్జాతీయ స్థాయి లో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే లక్ష్యంగా దీని ని తీర్చిదిద్దుతారు.

దేశవ్యాప్తంగా ఉన్న 3.5కోట్ల నిరుద్యోగ యువతకు ప్రస్తుత మార్కెట్‌లో ఉద్యోగం లభించేలా సంకల్ప్ పథకం కింద నైపుణ్యం పెంచేందుకు బడ్జెట్‌లో రూ,4000 కోట్లు కేటాయించారు. నాణ్యమైన విద్యను అందించే విద్యాసంస్థలకు మరింత స్వతంత్రత కల్పించేందుకు యూనివర్సిటీ నిధుల సంఘం (యూజీసీ)ని పునర్వ్యవస్థీకరిస్తారు. ఫలితాల ఆధారంగా ఆయా విద్యాలయాలకు (అక్రిడిటేషన్) గుర్తింపు ఇస్తారు. విద్యలో నాణ్యత పెంపు, లింగ వివక్ష లేకుండా, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే మూడులక్ష్యాలతో ప్రాథమిక విద్యాభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటుచేశారు. విద్యలో వెనుకబడిన 3,479 ప్రాంతాల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యాబోధన సౌలభ్యం కల్పిస్తారు. పాఠశాలల్లో వార్షిక విద్యాసామర్థ్యాన్ని కొలిచే వ్యవస్థ ఏర్పాటుచేశారు. స్థానికుల్లో ఉన్న టాలెంట్‌ను వెలికితీసి శాస్త్ర, సాంకేతిక అంశాలపై వారిలో ఉన్న సృజనాత్మకతకు ప్రోత్సహిస్తారు. రూ.2,200 కోట్లతో పారిశ్రామిక విలువ వృద్ధికి నైపుణ్యాల బలోపేత పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఐటీఐ, పారిశ్రామిక క్లస్టర్లలో ఇచ్చే శిక్షణ ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా ఉండేలా చేస్తారు. వస్త్రరంగంలో కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక పథకం తీసుకొచ్చారు. తోలు, చెప్పుల పరిశ్రమల్లోనూ దీనిని అమలుచేయనున్నారు. పర్యాటకంలో పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనకు రాష్ర్టాల భాగస్వామ్యంతో ఐదు ప్రత్యేక టూరిజం జోన్లు, నిర్దిష్ట లక్ష్యం కోసం ఐదు పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు.

సంకల్ప్‌తో 3.5 కోట్ల మంది యువతకు శిక్షణ

కేంద్ర బడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నిరుద్యోగ యువత కోసం సంకల్ప్ ( స్కిల్ అక్విజేషన్ అండ్ నాలెడ్జ్ అవేర్‌నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ ప్రోగ్రాం )తో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆయా సంస్థల అవసరాల మేరకు 3.5 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు బడ్జెట్‌లో 4 వేల కోట్లు కేటాయించామన్నా రు. దేశంలోని యువతకు విద్య, నైపుణ్యం, ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. బడ్జెట్‌లోని 10 కీలకరంగాల్లో యువత కూడా ఉన్నదని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో 60 ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలు ఉండగా, వాటిని 600 జిల్లాలకు పైగా విస్తరిస్తామని ప్రకటించారు. దేశంలో 100 అంతర్జాతీయ నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఇందులో విదేశీ భాషలపై కూడా శిక్షణ ఇస్తామని తెలిపారు. దీంతో విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లేవారికి ఉపయోగపడుతున్నదని వివరించారు. ఐటీఐ చేసినవారికి 2200 కోట్లతో స్ట్రివ్ అనే శిక్షణ కార్యక్రమం చేపట్టనున్నట్టు చెప్పారు.

LEAVE A REPLY