విత్తనాలు, ఎరువులు, ఆహారం కల్తీపై ఉక్కుపాదం

0
50

నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ ఆహారపదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. వీటిని తయారుచేసినవారితోపాటు సరఫరా చేసినవారిపైనా, విక్రయించిన వారిపైనా పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమం కోసం, వ్యవసాయ రంగం పురోభివృద్ధి కోసం ప్రభుత్వ కార్యక్రమాలను అమలుచేయటానికి వీలుగా.. ఈ నెల 10 నుంచి జూన్ 10 వరకు వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో పర్యటించి వ్యవసాయ భూముల వివరాలు సేకరించాలని ఆదేశించారు. ప్రస్తుతం వరి విషయంలోనే సాధ్యమైన స్వయంసమృద్ధిని ఇతర ఆహారధాన్యాలు, కూరగాయలు, పండ్ల విషయంలోనూ సాధించాలన్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మీద ఒక్క గుంత కనిపించినా సంబంధిత స్థానిక అధికారిని సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మే నెలాఖరు వరకు రోడ్ల మీద ఉన్న గుంతలన్నీ పూడ్చివేయాలని, జూన్ 1 నుంచి తానే స్వయంగా రాష్ట్రమంతటా పర్యటించి పరిశీలిస్తానన్నారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఈ ఏడాది చివరికి గ్రామాల్లోకి కృష్ణా, గోదావరి జలాలు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సోమవారం.. వ్యవసాయం, ఆర్‌అండ్‌బీ, మిషన్ భగీరథపై వేర్వేరుగా సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రమంత్రులు అనంత్‌కుమార్, నితిన్‌గడ్కరీలతో ఫోన్‌లో మాట్లాడి రాష్ట్ర అవసరాలను వివరించారు. వరంగల్, బెంగళూరు, విజయవాడ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించటానికి ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని గడ్కరీని సీఎం కేసీఆర్ కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here