విజయనగరం జిల్లాలో ఆటో, లారీ ఢీ

0
29

రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. అతి వేగం, పరిమితికి మించి ప్రయాణం విజయనగరం జిల్లాలో ఆరు ప్రాణాలను బలి తీసుకున్నాయి. తిరుమలేశుడి దర్శనం చేసుకుని వస్తున్న పెళ్లి బృందం వాహనం ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వరుడి సోదరుడు, సహా ఇద్దరు మరణించారు. పెళ్లి కుమారుడితో పాటు మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాతవలస కూడలి సమీపంలోని చందకపేట వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విజయనగరం నుంచి నాతవలస వైపు అతి వేగంగా వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న ఆటో బలంగా ఢీకొన్నాయి. లారీ వేగానికి ఆటో 15 అడుగుల దూరంలో పడింది. అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికుల్లో ఐదుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను డెంకాడకు చెందిన బంగారు సూరిబాబు(34), భోగాపురం మండలం నందిగాంకు చెందిన మిరప గోవింద(37), పూసపాటిరేగ మండలం గోవిందపురానికి చెందిన గులివిందల అప్పలనాయుడు(50), చోడమ్మ అగ్రహారానికి చెందిన ఆవాల శంకరరావు(47), శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లికి చెందిన నెల్లిమర్ల అప్పారావు(27)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన విజయనగరం కోరాడ వీధికి చెందిన ఆర్‌.రాజేష్‌ (23) జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంగారు అప్పారావు(డెంకాడ), ఎం.బంగార్రాజు (పైడిభీమవరం), అటోడ్రైవర్‌ పి.శ్రీను విజయనగరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచలో చికిత్స పొందుతున్న ఆర్‌.రాజశేఖర్‌ (విజయనగరం) పరిస్థితి విషమంగా ఉంది. ఎస్పీ ఎల్‌కేవీ రంగారావు, అర్డీవో శ్రీనివాసమూర్తి, ముగ్గురు ఎంవీఐలు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలపై ఆరా తీశారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అటు.. ప్రకాశం జిల్లాలో తిరుమలేశునికి మొక్కు చెల్లించుకుని వస్తున్న పెళ్లి బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. పాత గుంటూరుకు చెందిన పడవల రామస్వామి చిన్న కుమారుడు జయశంకర్‌దేవ్‌కు ఈ నెల 15న పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా రామస్వామి కుటుంబసభ్యులతో కలిసి గత ఆదివారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి గుంటూరు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ చెన్నుబోయిన సుబ్బారావు(30), రామస్వామి పెద్ద కుమారుడు కుమార్‌ సాయి శంకర్‌(33)అక్కడికక్కడే మృతి చెందారు. వరుడు జయ శంకర్‌ దేవ్‌, ప్రమాదంలో మృతి చెందిన కుమార్‌ సాయి శంకర్‌ భార్య హనుమతి, వారి కుమార్తె లహరి తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఈ ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది. ప్రమాదంలో రామస్వామి, ఆయన భార్య స్వల్పంగా గాయపడ్డారు. వధువు ఆమె తరపు బంధువులు మరో చిన్నారి క్షేమంగా బయటపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here