విజయం ముంగిట భారత్

0
16

వాంఖడేలో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగొందల స్కోరు చేసిన ప్రత్యర్థి జట్టు ఇప్పటిదాకా ఓడిపోలేదు. కానీ.. ఈ చరిత్రను తిరగరాసేందుకు టీమిండియా సిద్ధమైంది. కెరీర్‌లో భీకర ఫామ్‌లో ఉన్న కోహ్లీ (340 బంతుల్లో 25 ఫోర్లు, సిక్సర్‌తో 235) కెరీర్‌ బెస్ట్‌ స్కోరుకు, జయంత్‌ యాదవ్‌ (204 బంతుల్లో 15 ఫోర్లతో 104) తొలి శతకం, స్పిన్నర్ల సమష్టి ప్రదర్శన తోడవడంతో నాలుగో టెస్టులో భారత్‌ విజయం ముంగిట నిలిచింది. పలు రికార్డు బద్దలు కొడుతూ కోహ్లీ, జయంత కళాత్మక విధ్వంసంతో తొలి ఇన్నింగ్స్‌లో 631 పరుగుల భారీ స్కోరు చేసిన భారత 231 రన్స్‌ ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం.. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ను మన స్పిన్నర్లు తిప్పేశారు. ఫలితంగా.. శనివారం ఆట ముగిసే సమయానికి 182 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమికి ఎదురీదుతోంది. ఇప్పటికీ 49 పరుగుల దూరంలో ఉన్న కుక్‌సేన చేతిలో మరో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అశ్విన్‌, జడేజా రెండేసి వికెట్లు తీయగా, జయంత, భువనేశ్వర్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ప్రస్తుతం జానీ బెయిర్‌స్టో (50 బ్యాటింగ్‌) అజేయ అర్ధ శతకంతో క్రీజులో ఉన్నాడు. జోస్‌ బట్లర్‌ మినహా మరో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ లేనందున అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లండ్‌ ఓటమిని తప్పించుకోలేదు. ఒకవేళ ఇంగ్లండ్‌ లోటు స్కోరును దాటి కొద్ది లక్ష్యాన్ని నిర్దేశించినా భారత్‌ దాన్ని ఛేదించడం కష్టం కాబోదు..! అందువల్ల మన విజయం దాదాపు ఖరారైనట్టే! అయితే, అది సోమవారం తొలి గంటలోనా.. తొలి సెషన్‌లోనా అన్నదే చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here