వర్సిటీలను శాసిస్తున్న ఏబీవీపీ!

0
27

సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే ఫిబ్రవరి నెల! ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ హోరెత్తిపోయింది. కుహనా జాతీయవాదానికి వ్యతిరేకంగా బలమైన గళం విప్పింది! ఫలితం.. పలువురు జేఎన్‌యూ నేతలపై రాజద్రోహం కేసుల నమోదు!! ఇప్పుడు వేదిక ఢిల్లీ యూనివర్సిటీకి మారింది! అక్కడా అదే తీరు! నిరసన సంస్కృతులు అనే అంశంపై డీయూలోని రాంజాస్ కాలేజీలో ఫిబ్రవరి 21న ఏర్పాటు చేసిన సెమినార్.. ఆరెస్సెస్/బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి నచ్చలేదు! ఎందుకంటే.. ఈ సెమినార్‌లో జేఎన్‌యూ విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్, షెహలా రషీద్ షోరా మాట్లాడనుండటమే! ఉన్నట్టుండి పెద్ద సంఖ్యలో ఏబీవీపీ కార్యకర్తలు క్యాంటీన్ ఏరియాలోకి ఆగ్రహంతో దూసుకొచ్చారు.

అక్కడున్నవారిని నెట్టుకుంటూ పోయారు అని ఒక విద్యార్థి చెప్పారు. సమీప భవనంరూఫ్‌పైన ఉన్న కొందరు చెట్ల కొమ్మ లు విరిచి కింద ఉన్న వారిపైకి విసిరేశారు. కొన్ని స్టీల్ బకెట్లు కూడా వారిపై పడ్డాయి. అప్పటి నుంచి వర్సిటీలో సీన్ మారిపోయింది. మరుసటిరోజే భారీ స్థాయిలో అరాచకానికి దిగిన ఏబీవీపీ కార్యకర్తలు.. తమను పోలీసులు గమనిస్తున్నారనిగానీ, తాము చేస్తున్న పనిని యూనివర్సిటీలోని నిఘా కెమెరాలు రికార్డు చేస్తున్నాయనిగానీ లెక్క చేయకుండా చెలరేగిపోయారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమను వ్యతిరేకించే విద్యార్థులపైకి ఇటుకలు, రాళ్లు విసిరారని, అనేక మందిని పట్టుకుని నిర్దయగా చితక్కొట్టారని విమర్శించారు. దీనిపై ఏబీవీపీ రెండు విధాలుగా స్పందించింది. తామేమీ హింసాత్మకంగా ప్రవర్తించలేదని చెప్పడం ఒకటైతే.. జాతి వ్యతిరేకులను వ్యతిరేకించడంపై క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని చెప్పడం మరొకటి. ఢిల్లీ యూనివర్సిటీని మరో జేఎన్‌యూను చేయనీయబోమనేది వారి వాదన. భవిష్యత్తులో కూడా ఎవరైనా ఎలాంటి ప్రయత్నమైన చేస్తే.. నిరసించి తీరుతాం.. అని ఒక ఏబీవీపీ నేత చెప్పారు. దీని నుంచి రెండు నిర్థారణలకు రావచ్చు. జేఎన్‌యూ నేతలు కన్హయ్యకుమార్, ఖలీద్, రషీద్.. ఈ ముగ్గురూ ప్రభావవంతమైన నేతలుగా ఎదిగారని ఏబీవీపీ గుర్తిస్తున్నది. వాళ్లు అనేక రాజకీయ అంశాల గురించి మాట్లాడుతారని భయపడుతున్నది.

అందుకే వారి ప్రభావాన్ని సాధ్యమైనంత పరిమితం చేసేందుకు వారిని వ్యతిరేకించాలనుకుంటున్నది అని ఒక విశ్లేషకుడు చెప్పారు. కేవలం ఢిల్లీ యూనివర్సిటీకే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ఏబీవీపీ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నదన్న అభిప్రాయాలు ఉన్నాయి. యూనివర్సిటీ వ్యవహారాల్లో ఏబీవీపీ బలవంతపు జోక్యం చేసుకుంటున్న ఉదంతాలూ ఉంటున్నాయని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ అంటున్నారు. కొంతకాలం క్రితం జోధ్‌పూర్ యూనివర్సిటీలో జేఎన్‌యూ ప్రొఫెసర్ నివేదిత మీనన్‌తో ఉపన్యాసం ఏర్పాటు చేసినందుకు ఆ కార్యక్రమ నిర్వాహకుడు సస్పెన్షన్‌కు గురయ్యాడు. మహాశ్వేతాదేవి రాసిన ఒక చిన్న కథను వేదికపై ప్రదర్శించిన హర్యా నా సెంట్రల్ యూనివర్సిటీ టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. హిందూ దేవతలపై మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్సిటీలో సభ ఏర్పాటు చేసిన విద్యార్థిపై దాడి జరిగింది. జేఎన్‌యూ ప్రొఫెసర్‌ను పిలిచి సభ పెట్టినందుకు జార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీలోని అసోసియేట్ ప్రొఫెసర్‌ను సస్పెం డ్ చేశారు. ఇటువంటి అన్ని ఉదంతాల్లోనూ ఏబీవీపీ ప్రమేయం ఉందని అపూర్వానంద్ ఆరోపించారు. ప్రత్యేకించి డీయూ క్యాంపస్‌లో జేఎన్‌యూకు ఏ నాయకుడూ ఏ కార్యక్రమంలో పాల్గొనరాదని ఏబీవీపీ ఆంక్షలు విధించినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో మూడు టాప్ పొజిషన్లను గెల్చుకున్న ఏబీవీపీ.. తనకు ఇష్టం లేని అంశాలను జాతి వ్యతిరేకం అని ముద్ర వేస్తున్నదనే అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తంగా ఒక పథకం ప్రకారం యూనివర్సిటీల్లోని రాజకీయ వాతావరణాన్ని మార్చివేయాలని ఏబీవీపీ భావిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో తాజా పరిణామాలను ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుందని చెప్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here