వచ్చే 11 నెలలే కీలకం

0
22

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం కాబోతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. అనేక రాష్ర్టాలు ఈ పథకం అమలుపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు. నిర్దేశిత లక్ష్యం ప్రకారం డిసెంబర్ నాటికి 42,38,980 గృహాలకు తాగునీరు అందిస్తామని సీఎం చెప్పారు. అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు పనుల్లో మరింత వేగం పెంచాలని అదేశించారు. మిషన్ భగీరథకు రూ.30 వేల కోట్ల వరకు ఆర్థిక సంస్థల నుంచి రుణం లభించిందని, క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరుగడమే ఇప్పుడు ప్రధానమని సీఎం అన్నారు. పైప్‌లైన్లకు అనుమతులు, ఇతర అంశాల్లో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారానికి ఆయా శాఖలతో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో మిషన్ భగీరథ పథకంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

అందరి చూపు మనవైపే..

అన్ని రాష్ర్టాలు మనవైపు చూస్తున్నాయి. ప్రధానమంత్రి స్వయంగా ప్రారంభించారు. 7 రాష్ర్టాల ప్రతినిధులు వచ్చి అధ్యయనం చేశారు. నీతి ఆయోగ్ ప్రశంసించింది. చాలా రాష్ర్టాలు తమ ప్రజలకు మిషన్ భగీరథ లాంటి పథకం అందించడానికి సిద్ధపడుతున్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో రేయింబవళ్లు కష్టపడి విజయవంతం చేయడానికి కృషిచేయాలి అని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెగ్మెంట్ల వారీగా పరిస్థితిని సీఎం సమీక్షించారు. ఇన్‌టేక్‌వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పైప్‌లైన్లు, విద్యుత్ సబ్‌స్టేషన్లు తదితర నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈఎన్సీ నుంచి డీఈల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారులతో సీఎం నేరుగా మాట్లాడారు. సమస్యలు తెలుసుకొని వాటికి అప్పటికప్పుడు పరిష్కారాలు సూచించారు.

LEAVE A REPLY