లండన్ లో నయనతార

0
31

నటి నయనతార లండన్ లో మకాం వేశారు. తమిళంలోనే కాకుండా దక్షిణాదిలోనే అగ్ర కథానాయకిగా విరాజిల్లుతున్న తార నయనతార. ప్రస్తుతం స్టార్‌ హీరోల నుంచి యువ హీరోల వరకూ తమ పక్కన హీరోయిన్ గా కోరుకుంటున్న నటి నయనతార. అయితే తనను మాత్రం లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు వరుసగా వరిస్తుండడం విశేషం. లేడీ సూపర్‌స్టార్‌ పట్టంతో చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్న నయనతార నటిస్తున్న తాజా చిత్రం కొలైయుదీర్‌ కాలం. హీరోయిన్  సెంట్రిక్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ సోమవారం లండన్ లో శ్రీకారం చుట్టుకుంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీతదర్శకుడు యువన్ శంకర్‌రాజా నిర్మాతగా మారారు.

ఆయన వైఎస్‌ఆర్‌ ఫిలింస్‌ సంస్థను ప్రారంభించి ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత వాసు బద్నాని చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఫిలింస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు కమలహాసన్ తో ఉన్నైపోల్‌ ఒరువన్, అజిత్‌ హీరోగా బిల్లా–2 చిత్రాలను తెరకెక్కించిన చక్రీ తోలేటి ఈ చిత్రానికి దర్శకుడు. కొలైయుదీర్‌ కాలం చిత్రం ద్వారా నిర్మాతగా మారిన యువన్  శంకర్‌రాజా తన భావాన్ని వ్యక్తం చేస్తూ ఇది మరచిపోలేని సంఘటనగా పేర్కొన్నారు. ఉన్నత విలువలతో కూడిన మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న తన కోరిక నెరవేరే తరుణం ఇదన్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత వాసు బద్నానితో కలిసి చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఇక తన మిత్రుడు, దర్శకుడు చక్రి తోలేటి బ్రహ్మాండమైన కథను హాలీవుడ్‌ చిత్రాల స్థాయికి దీటుగా తయారు చేశారని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here