రోజర్ జోష్

0
14
Switzerland's Roger Federer celebrates winning his singles match against Spain's Rafael Nadal at the ATP World Tour Finals in London November 28, 2010. REUTERS/Suzanne Plunkett (BRITAIN - Tags: SPORT TENNIS)

ఐదేండ్లుగా మేజర్ టైటిల్‌కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న రోజర్ ఫెదరర్ నిరీక్షణ ఫలించే దిశగా కనిపిస్తున్నది. గట్టి ప్రత్యర్థులనుకున్నవాళ్లంతా ఆరంభరౌండ్లలోనే నిష్క్రమిస్తుండడంతో అవకాశాన్ని ఒడిసిపట్టుకునేందుకు స్విస్ మాస్టర్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు. అందులో భాగంగానే ఒక్కో రౌండ్‌ను అధిగమించుకుంటూ వస్తున్న ఫెదరర్ ఇప్పుడు సెమీఫైనల్ చేరుకొని రికార్డుస్థాయిలో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకునేందుకు రెండడుగుల దూరంలో నిలిచాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో 17వ సీడ్ ఫెదరర్ 6-1, 7-5, 6-2తో జర్మన్ జెయింట్‌కిల్లర్ మిస్చా జ్వెరెవ్‌ను చిత్తుచేశాడు. గతరౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రేకు ఝలకిచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన జ్వెరెవ్.. ఫెదరర్ జోష్ ముందు తేలిపోయాడు. దాదాపు గంటన్నరకుపైగా సాగిన ఏకపక్ష పోరులో జ్వెరెవ్ సర్వ్‌ను ఆరుసార్లు బ్రేక్‌చేసిన ఫెదరర్ మ్యాచ్‌లో ఏకంగా 65విన్నర్లు సంధించి తన ఆటలో జోరు తగ్గలేదని చాటుకున్నాడు. ఐదుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అయిన ఫెదరర్ ఈ వేదికపై 13వ సారి సెమీఫైనల్ చేరాడు. ఓవరాల్‌గా అతనికిది 41వ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ కావడం విశేషం. ఇక 1978లో ఆర్ధర్ ఆష్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ చేరిన అత్యధిక వయసు ఆటగాడిగా 35ఏండ్ల ఫెదరర్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్ గ్రాండ్‌స్లామ్ పరంగా చూస్తే.. 39ఏండ్ల వయసులో జిమ్మీ కానర్స్ 1991 యూస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరాడు. సెమీఫైనల్లో తన దేశానికే చెందిన మాజీ చాంపియన్ స్టానిస్లాస్ వారింకాతో ఫెదరర్ తలపడుతాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో 4వ సీడ్ వారింకా 7-6(7/2), 6-4, 6-2తో ఫ్రాన్స్ ఆజానుబాహుడు జోవిల్ ఫ్రెడ్ సోంగాపై విజయం సాధించాడు. ఇప్పటిదాకా ఫెదరర్‌తో ముఖాముఖి రికార్డులో 3-18తో వారింకా వెనుకంజలో ఉన్నాడు. అందులోనూ గ్రాండ్‌స్లామ్స్‌లో ఫెదరర్‌తో ఆరుసార్లు తలపడితే వారింకా ఒకేసారి గెలుపొందాడు. ఈ నేపథ్యంలో గత పరాభవాలకు వారింకా ఈసారి ప్రతీకారం తీర్చుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY