రైల్వేకు లక్ష కోట్లతో భద్రత నిధి

0
22

రైల్వే శాఖలో రక్షణ చర్యలను మెరుగుపరిచేందుకు రూ.లక్ష కోట్లతో ప్రత్యేక భద్రత నిధిని నెలకొల్పాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రైళ్లు తరచుగా పట్టాలు తప్పి ప్రమాదాలపాలవుతున్న నేపథ్యంలో.. ట్రాకులను, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి, కాపలా లేని లెవెల్ క్రాసింగులను తొలగించడానికి ఈ నిధిని ఉపయోగించాలని సంకల్పించింది. 2017-18లో 3500 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు వేయాలని కొత్త బడ్జెట్‌లో ప్రతిపాదించింది. కిందటేడాది 2800 కిలోమీటర్లు ప్రతిపాదించారు. రైల్వే బడ్జెట్‌ను విడిగా కాకుండా ఈ ఏడాది నుంచి సాధారణ బడ్జెట్‌లోనే ఆ శాఖకు కేటాయింపులను ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రైల్వేకు మొత్తంగా రూ.1,31,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కిందటేడాది కన్నా రూ.10వేల కోట్లు ఎక్కువ. రూ.లక్ష కోట్లతో రాష్ట్రీయ రైల్ సంరక్ష కోశ్ (నేషనల్ రైల్ సేఫ్టీ ఫండ్) ఏర్పాటుచేయనున్నట్లు ఆయన ప్రతిపాదించారు.

ఈ సందర్భంగా భద్రత ప్రాధాన్యం గురించి విపులంగా మాట్లాడారు. 2020కల్లా బ్రాడ్‌గేజ్ మార్గాల్లో కాపలా లేని లెవెల్ క్రాసింగులన్నింటినీ తొలగిస్తామని చెప్పారు. 500 రైల్వేస్టేషన్లను వికలాంగులకు ఎలాంటి అసౌకర్యం కలుగని విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అన్ని కోచుల్లోనూ బయో టాయిలెట్లను ఏర్పాటుచేస్తామని, ప్రయాణికుల కోసం క్లీన్ మై కోచ్ యాప్‌ను అందుబాటులోకి తెస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ-టికెటింగ్‌ను ప్రోత్సహించేందుకు ఐఆర్సీటీసీ ద్వారా కొనుగోలు చేసే టికెట్లకు సర్వీసు చార్జీలను ఉపసంహరించనున్నట్లు ప్రకటించారు. ఐఆర్సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ, ఐఆర్సీవోఎన్ వంటి రైల్వే సంబంధ సంస్థలను స్టాక్ ఎక్సేంజీలలో లిస్టు చేస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here