రైతుల ఆవేదన చూసి చలించిపోయిన మంత్రి

0
20

ఆరుగాలం కష్టించి పండించిన పంట నేలపాలయ్యింది.. నోటికాడికి వచ్చిన బువ్వను వానదేవుడు వడగండ్ల రూపంలోఎత్తుకపోయిండు.. అంటూ రైతులు కన్నీటి పర్యంతమైన దృశ్యాలను చూసి రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చలించిపోయారు. ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. బోరున విలపిస్తున్న అన్నదాతలను అక్కున చేర్చుకొని అధైర్యపడవద్దు.. ధైర్యంగా ఉండాలి.. సర్కార్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, సిద్దిపేట, జనగామ నియోజకవర్గాలకు చెందిన పలు గ్రామాల్లో బుధవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షాలతో రైతులు తీవ్రంగా పంటలను నష్టపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు గురువారం వేకువజామున టీ, టిఫిన్ కూడా తీసుకోకుండా నైట్‌ప్యాంట్, టీషర్టు మీదనే పంట పొలాలను పరిశీలించటానికి ఉదయం 6 గంటలకు సిద్దిపేట నుంచి బయలుదేరారు. వరుసగా ఎనిమిది గంటలపాటు 22 గ్రామాల్లో పర్యటించి రైతులను ఓదార్చారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి అక్కన్నపేట మండలంలోని పలుగ్రామాల్లో పంటనష్టాన్ని తొలుత పరిశీలించారు. అక్కడి నుంచి హుస్నాబాద్ చేరుకొని విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం సిద్దన్నపేట, నాగరాజుపల్లి, తిమ్మాయిపల్లి, బాషాయిగూడెం, ముండ్రాయి, వెంకటాపూర్ తదితర గ్రామాల్లో పర్యటించి పంటపొలాలను పరిశీలించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత జనగామ నియోజకవర్గంలోని కొమురవెల్లి మండలం ఐనాపూర్, గురువన్నపేటల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ బొడెకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి పర్యటించి రైతులకు మంత్రి హరీశ్‌రావు ధైర్యం చెప్పారు. మరోవైపు, గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలంలో వడగండ్లతో నష్టపోయిన పంట పొలాలను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విడిగా పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here