పెద్ద నోట్ల రద్దు ద్వారా బ్యాంకులకు ఇప్పటికే 12.44 లక్షల కోట్ల విలువైన పాత కరెన్సీ వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. డిసెంబర్ 10వ తేదీలోపు ఆ మొత్తం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పాత నోట్లను రద్దు చేసిన తర్వాత సుమారు 4.61 లక్షల కోట్ల కొత్త నోట్లను బ్యాంకులకు విడుదల చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. బ్యాంక్ కౌంటర్లు, ఏటీఎంల ద్వారా ఆ మొత్తాన్ని రిలీజ్ చేసినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. రూ.500, వెయ్యి నోట్లను కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8వ తేదీన రద్దు చేసిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు వల్ల చెలామణిలో ఉన్న సుమారు 86 శాతం కరెన్సీ నిలిచిపోయింది. పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు ఈ నెల 30వ తేదీ చివర కావడం వల్ల రద్దు అయిన నోట్లు సుమారు 13 నుంచి 13.50 లక్షల కోట్లు బ్యాంకులకు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.