రాష్ర్టానికి నిధులపై కేంద్రం సానుకూలం

0
23

కేంద్ర బడ్జెట్ తుది దశకు చేరుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అవసరాల గురించి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో రాష్ట్ర మంత్రి కేటీఆర్ శుక్రవారం అరగంటకు పైగా చర్చించారు. ఎయిమ్స్, సిరిసిల్ల మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌తోపాటు పలు అంశాలను, పునర్వ్యవస్థీకరణ చట్టంలో అమలుకు నోచుకోకుండా ఉన్న పలు హామీలను ప్రస్తావించారు. రానున్న బడ్జెట్‌లో తెలంగాణకు స్పష్టంగా ఎయిమ్స్, పవర్‌లూమ్ క్లస్టర్ల ప్రకటనతోపాటు నిధుల కేటాయింపు చేయాలని కోరారు. సానుకూలంగా జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ అభివృద్ధి, జీడీపీ, వృద్ధిరేటు తదితరాల పట్ల జైట్లీ ప్రశంసల జల్లు కురిపించారు. భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విజ్ఞప్తులపై కేంద్రం నుంచి రానున్న బడ్జెట్‌లో ప్రకటన, నిధుల కేటాయింపు ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. రానున్న బడ్జెట్‌లో తెలంగాణకు ఆర్థికంగా చేయాల్సిన సాయం గురించి సీఎం కేసీఆర్ గతంలోనే లేఖ రాశారని, ఇప్పుడు కేంద్ర బడ్జెట్ తయారవుతున్నందువల్ల ఆ అంశాలను తాను స్వయంగా కలిసి వివరించానని తెలిపారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందువరుసలో ఉన్నదని, కేంద్రం తరఫున అన్ని రకాలుగా చేయూత ఉంటుందని జైట్లీ హామీ ఇచ్చారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here