రాష్ట్రమంతటా ఫైబర్ ఆప్టికల్

0
24

పొలాలకు సాగునీరు.. ఇంటింటికీ తాగునీరు అనే లక్ష్యంతో శరవేగంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం అదే రీతిలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందుబాటులోకి తేవడానికి వేగంగా అడుగులు వేస్తున్నది. నెట్టింటి నుంచే పౌరసేవల వినియోగంతోపాటు ప్రజలు సులభంగా డిజిటల్ లావాదేవీలు పూర్తిచేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నది. భారత్ బ్రాండ్ నెట్‌వర్క్ ద్వారా కేంద్ర ప్రభుత్వం.. జిల్లా, మండల, గ్రామం లక్ష్యంగా కేబుల్ లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా నేషనల్ ఆఫ్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ పథకం (ఎన్‌వోఎఫ్‌ఎన్) కింద ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని 6193 ఆవాసాల్లో ఇంటర్నెట్ పైపులైన్ నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసింది. పనులు పూర్తయిన జిల్లాల్లో ప్రజలు పౌరసేవలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఈ పైపులైన్లు గ్రామపంచాయతీ కార్యాలయానికి మాత్రమే పరిమితం కావడంతో ఆ గ్రామ పౌరులందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం లేదు.

మిగతా జిల్లాల పరిధిలో 24,248 ఆవాసాల (ప్రజలు నివసించే ప్రాంతాలు) ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తేవాలని, తద్వారా ఇంటి నుంచే మెరుగైన పౌర సేవలు పొందే అవకాశం కల్పించాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందుకోసం 36,531 కిలోమీటర్ల మేర ఫైబర్ ఆప్టికల్ కేబుల్ లైన్ వేయాలి. ఈ పైపులైన్ నిర్మాణం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధంచేసింది. మరోవైపు భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్)తో సంప్రదిస్తున్నది. ఫైబర్ గ్రిడ్ నిర్మాణ పనులు అత్యంత వేగంగా చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. మిషన్ భగీరథకు సమాంతరంగా ఫైబర్ ఆఫ్టికల్ డక్ట్ నిర్మాణం చేపడుతున్నది. ఈ గ్రిడ్ పనులను డ్యూరాలైన్, జైన్ ఇరిగేషన్, వీకే ప్లాస్, పుర్మాప్లస్, మోనీపాలిటిక్ నెట్‌వర్క్ సంస్థలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 24,248 ఆవాసాల పరిధిలో 4048.50 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ డక్ట్ పనులు పూర్తయ్యాయి. నిర్దేశిత లక్ష్యంలోపు మిగతా డక్ట్ నిర్మాణ పనులు పూర్తవుతాయని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here