రాష్ట్రం అభివృద్ధి చెందకూడదా?

0
25

రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని, పరిశ్రమలు రాకూడదని, రాష్ట్రం గొడ్డుపోవాలని ప్రతిపక్ష నాయకుడు జగన్‌ కోరుకుంటున్నారని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఒకవైపు ఉద్యోగాలు రావటం లేదంటారు, మరోవైపు పరిశ్రమలు అడ్డుకునేలా మాట్లాడతారు, ఈయనేం ప్రతిపక్ష నాయకుడండీ అని యనమల ప్రశ్నించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావుతో కలిసి మంగళవారం రాత్రి విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా జగన్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నమూ విఫలమైందని వ్యాఖ్యానించారు. తలసరి ఆదాయం, వృద్ధి, స్థూల ఉత్పత్తి తదితర అంశాలన్నీ లెక్కించడానికి ప్రపంచం ఆమోదించిన స్పష్టమైన విధానాలు (మెథడాలజీ) ఉన్నాయని, సంవత్సరాల తరబడి అదే విధానం అనుసరిస్తున్నారని, ఈ లెక్కలు రాష్ట్రం సొంతంగా ఇష్టమొచ్చినట్లు రూపొందించేవి కావని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే పెట్టుబడిదారులు వస్తారని, ఈయన రాకూడదనుకుంటారని మంత్రి విమర్శించారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చే అవార్డులను కాదనడానికి ఈయన ఎవరండీ అని ప్రశ్నించారు.

50% ఎంవోయూలు అమల్లోకి వచ్చాయి
రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో (ఎంవోయూలు) 50 శాతం అమల్లోకి వచ్చాయని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. శాసనసభలో సభ్యులు నరేంద్రకుమార్‌ తదితరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. 2016, 2017 విశాఖ భాగస్వామ్య సదస్సులలో కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాలుస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు రూ.1,93,903 కోట్ల పెట్టుబడితో 2,33,069 మంది వ్యక్తులకు ఉపాధిని కల్పించే 127 ఒప్పందాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అలాగే రూ.2,76,846 కోట్ల పెట్టుబడితో 6,27,805 మందికి ఉపాధి కల్పించే 161 ఒప్పందాలు అమలు దశలో ఉన్నాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here