రాయ్ పెరోల్ గడువు పెంపు

0
26

హారా చీప్ సుబ్రతా రాయ్‌కు మరోసారి ఊరట లభించింది. ఆయన పెరోల్ గడువును సుప్రీంకోర్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది. అయితే ఇందుకోసం రూ.600 కోట్లను మార్కెట్ నియంత్రణ మండలి సెబీ వద్ద డిపాజిట్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం రాయ్‌ను ఆదేశించింది. ఒకవేళ డబ్బును డిపాజిట్ చేయని పక్షంలో మళ్లీ తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకుర్, న్యాయమూర్తి రంజన్ గోగోయి, ఏకే సిక్రీ నాయకత్వంలోని ప్రత్యేక బెంచ్ హెచ్చరించింది. సహారా గ్రూపునకు సంబంధించి ఆస్తుల విక్రయంపై సరైన ప్రతిపాదనతో రావాలని..మీకు లభ్యమవకపోతే సరైన కొనుగోలుదారులను వెతికిపెట్టనున్నట్లు రాయ్ తరపున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌కు ప్రత్యేక బెంచ్ సూచించింది.
రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన నిధుల్లో ఎంతమేర తిరిగి చెల్లించారని.. సహారా గ్రూపునకు రూ.1.87 లక్షల కోట్ల స్థాయిలో ఆస్తులు ఉన్నప్పటికీ ఎందుకు తిరిగి చెల్లించడం లేదని కోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకు సెబీ వద్ద రూ.1,200 కోట్లు డిపాజిట్ చేశామని, వీటితోపాటు రూ.11 వేల కోట్ల చెల్లింపులు జరిపినట్లు కపిల్ సిబల్ కోర్టుకు విన్నవించుకున్నారు. మార్కెట్ నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా గ్రూపునకు చెందిన రెండు సంస్థలు రూ.25 వేల కోట్ల స్థాయిలో నిధులు సేకరించాయి. ప్రస్తుతం ఇవి వడ్డీతో కలిపి రూ.37 వేల కోట్లకు చేరాయి. వీటిలో సహారా రూ.10,918 కోట్లు తిరిగి చెల్లింపులు జరిపింది. మిగతా రూ.24,029 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లింపుల్లో రాయ్ విఫలమవడంతో 2014 మార్చి 4 నుంచి తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. రాయ్ తల్లి మరణించడంతో మే నెలలో కోర్టు మానవతా దృక్పథంతో పెరోల్ మంజూరు చేసింది. అక్టోబర్ 25న సుప్రీంకోర్టు రాయ్ పెరోల్ గడువును నవంబర్ 28 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here