రాయుడొచ్చాడు…

0
6

ఐపీఎల్‌లో అదరగొడుతున్న తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడును మరోసారి భారత జట్టు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తలపడే జట్టులోకి రాయుడును సెలక్టర్లు ఎంపిక చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత అతను టీమిండియాలోకి పునరాగమనం చేయడం విశేషం. కేదార్‌ జాదవ్‌ గాయపడటం, మనీశ్‌ పాండే వరుస వైఫల్యాలతో మిడిలార్డర్‌లో ఒక ప్రధాన బ్యాట్స్‌మన్‌ అవసరం జట్టుకు కలిగింది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సరైన ఆటగాడిగా రాయుడును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ గుర్తించింది. 2017–18 దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో రాయుడు 5 మ్యాచ్‌లలో (నిషేధం కారణంగా 2 మ్యాచ్‌లు ఆడలేదు) 43.20 సగటుతో 216 పరుగులు చేశాడు. తాజాగా ఐపీఎల్‌లో అతని ప్రదర్శన సెలక్టర్లను ఆకర్షించింది. ఇప్పటివరకు చెన్నై తరఫున 10 మ్యాచ్‌లలో 151.61 స్ట్రైక్‌రేట్‌తో 423 పరుగులు చేసిన రాయుడు, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే అనూహ్యంగా రాయుడుకు టి20 టీమ్‌లో మాత్రం స్థానం లభించలేదు. గత ఏడాది శ్రీలంకతో వన్డే సిరీస్‌ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన లోకేశ్‌ రాహుల్‌కు మళ్లీ అవకాశం లభించింది. రాహుల్‌ భారత్‌ తరఫున ఇప్పటి వరకు 10 వన్డేలు ఆడాడు. ఇప్పటి వరకు టెస్టు జట్టులో రెగ్యులర్‌గా ఉన్న ఉమేశ్‌ యాదవ్‌కు తాజాగా వన్డే, టి20 జట్లలో కూడా స్థానం లభించింది. ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చడం అతనికి అనుకూలంగా మారింది. గత ఏడాది సెప్టెంబర్‌లో తన ఆఖరి వన్డే ఆడిన ఉమేశ్‌… టి20ల్లో ఒకే ఒక మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటికే టి20 జట్టులో ఉన్న సుందర్‌కు వన్డేల్లో మరోసారి పిలుపొచ్చింది.

LEAVE A REPLY