రాటుతేలిన ముద్రగడను!

0
20
కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి, తాను కృశించిపోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని.. అయితే, కృశించిపోడానికి తాను పాత ముద్రగడను కానని రాటుతేలిన ముద్రగడనని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో సోమవారం మీడియాతో మాట్లాడారు.
తానిలా రాటుదేలడానికి ఆనాటి సీఎం ఎన్టీఆర్‌, ప్రస్తుత సీఎం చంద్రబాబు కారకులని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెడుతున్నామని చెబుతున్నారని, అయితే కులం కార్డుతో తమజాతికే కాకుండా ఇతర జాతులను ‘డి’ కేటగిరి నుంచి ‘ఏ’ కేటగిరీకి, బీసీ నుంచి ఎస్సీకి, ఎస్సీ నుంచి ఎస్టీకి మారుస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పి ఓట్లు వేయించుకోవడం సరైందా? అని ప్రశ్నించారు. ఇటీవల తమతో ఇద్దరు మంత్రులు, ఒక పెద్దాయన రాయబారం జరుపుతున్నారని.. అయితే గౌరవ ప్రదమైన ఆహ్వానం వస్తే చర్చలకు సిద్ధమని చెప్పినట్టు ముద్రగడ తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి కొరవడిందని ముద్రగడ విమర్శించారు. హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ప్రదర్శనకు విద్యార్థి లోకం పూనుకుంటే ఉక్కుపాదాలతో అణిచివేశారని మండిపడ్డారు.

       భగవంతుడిని ప్రార్థించండి: కాపు రిజర్వేషన్‌ కోసం రాష్ట్రంలోని దేవాలయాల్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి సోదర సోదరీమణులు కొబ్బరికాయలు కొట్టాలని ముద్రగడ పిలుపునిచ్చారు. కాపుల రిజర్వేషన్‌ అమలుకి సీఎం చంద్రబాబుకి భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టి భగవంతుడిని ప్రార్థించాలని ముద్రగడ కోరారు. తాను రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాలో శివాలయం వద్ద మంగళవారం యాగం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ముద్రగడ తెలిపారు. అయితే, యాగం ఏ జిల్లాలో ఎక్కడ అనేది వివరాలు చెప్పడానికి ముద్రగడ నిరాకరించారు. వివరాలు చెపితే ముందుగానే అక్కడి పూజారిని అరెస్టు చేయడమో, యాగాన్ని భగ్నం చేయడం జరగవచ్చని ముద్రగడ అన్నారు.

LEAVE A REPLY