సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. సహచర క్రికెటర్, విక్టోరియా జట్టు కెప్టెన్ మాథ్యూ వేడ్‌పై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన కారణంగా జరిమానా ఎదుర్కొన్నాడు. జాతీయ జట్టులోని ఆటగాళ్లందరు కలిసి మ్యాక్స్‌వెల్‌పై జరిమానా విధించారు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా విక్టోరియా తరఫున బరిలోకి దిగిన మ్యాక్స్‌వెల్.. కెప్టెన్ వేడ్‌ను ఉద్దేశించి అవమానకరంగా ప్రవర్తించాడు. వికెట్‌కీపర్ తర్వాత బ్యాటింగ్‌కు దిగడమనేది బాధ కల్గించే అంశం. సౌతాఫ్రికాతో ఆఖరిదైన మూడో టెస్ట్ కోసం తనను కాదని వేడ్‌ను ఎంపిక చేయడాన్ని మ్యాక్స్‌వెల్ బహిరంగంగా విమర్శించాడు. దీన్ని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌తో పాటు చీఫ్ కోచ్ డారెన్ లీమన్ తీవ్రంగా ఖండించారు.
జట్టులోని సహచర ఆటగానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మనం ఇతరులకు తగినరీతిలో గౌరవం ఇచ్చినప్పుడే మన విలువ ఏంటో తెలుస్తుంది. వేడ్‌పై అతను చేసిన వ్యాఖ్యలు జట్టులోని అందరిని బాధించాయి. జాతీయజట్టులో సభ్యునిగా ఉన్న ఓ ఆటగాడు ఇలా ప్రవర్తించడం సబబుకాదు. ఎప్పుడైనా, ఎక్కడైనా మన జట్టు ఆటగాళ్లకు, ప్రత్యర్థి ఆటగాళ్లను గౌరవించడం తెలుసుకోవాలి. అదే విధంగా అభిమానులు, మీడియా కు కూడా అదే రీతిలో గౌరవం ఇవ్వాలి అని స్మిత్ అన్నాడు. కాగా న్యూజిలాండ్‌తో మొదలయ్యే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే తొలి వన్డేకు మ్యాక్స్‌వెల్ అందుబాటులో ఉండనున్నాడు