మొబైల్ ఫోన్లపై బడ్జెట్ భారం!

0
12

ద్రవ్య చలామణిలో పారదర్శకతను పెంపొందించడానికి ఒకవైపు భీమ్ లాంటి మొబైల్ అప్లికేషన్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మరోవంక మొబైల్ ఫోన్ల ధరలు పెరిగేందుకు దోహదపడే నిర్ణయం తీసుకోవడం వినియోగదారులను విస్మయానికి గురిచేసింది. ఒకవంక మీ మొబైల్ ఫోనే మీ బ్యాంకు అని స్వయంగా ప్రధాని ప్రకటిస్తుంటే ఆర్థికమంత్రి జైట్లీ మాత్రం ఆ మొబైల్ ఫోన్లను వినియోగించడం భారంగా మార్చే ప్రకటన చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది.

మొబైల్ ఫోన్లలో వాడే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీ)లను దిగుమతి చేసుకోవడంపై పన్ను భారం విధించడంతో సమీప భవిష్యత్తులో ఇండియాలో తయారయ్యే ఫోన్ల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడం కోసం మన దేశంలోనే పీసీబీలను తయారయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోడాన్ని తప్పుపట్టడంలేదుగానీ దిగుమతి చేసుకోవడంపై పన్ను భారం పెంచడం వలన కొంతకాలం వరకూ ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
దేశంవ్యాప్తంగా సుమారు 35 కోట్ల మంది సాధారణ (బేసిక్) ఫోన్లు వాడుతున్నారని, మరో 35 కోట్ల మంది ఇంటర్నెట్ సౌకర్యంలేని ఫోన్లు వాడుతున్నారని, పట్టణ ప్రాంతాల్లోని సుమారు 25 కోట్లమంది మాత్రం స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ అంచనా వేసింది. అయితే ఈ ఫోన్లలో వాడే పీసీబీలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రస్తుతం మన దేశంలో పీసీబీల తయారీ మన అవసరాలకు సరిపోయేంతగా లేదు. ఈ పరిస్థితుల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పీసీబీలపై రెండు శాతం మేర స్పెషల్ అడిషనల్ డ్యూటీ (ఎస్‌ఏడీ) పేరుతో పన్ను వసూలు చేయాలని నిర్ణయించారు. మొబైల్ ఫోన్ల ధరలో దాదాపు 60% వరకు పీసీబీ ధర ఉంటుంది. వీటి దిగుమతిపై రెండు శాతం పన్ను విధించడం వల్ల అంతిమంగా ఫోన్ల ధరలు పెరుగుతాయి.

LEAVE A REPLY