పెద్దనోట్ల రద్దుతో డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యం పెరిగిపోయింది. ఆన్లైన్ ఖాతా, డెబిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్, ప్రీ-పెయిడ్ కార్డులు.. ఇలా పలు రకాలైన డిజిటల్ మార్గాలు ఉండగా, వీటిని ఏవిధంగా వినియోగించవచ్చు, ఏది తమకు అనుకూలం? అనే అవగాహన ప్రజల్లో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. రకరకాలుగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ అందులో మొబైల్ బ్యాంకింగ్ ఎంతో సులువు, సౌకర్యం, వేగం.. దీన్లోని ప్రత్యేకత. అందుకే ఎక్కువమంది మొబైల్ చెల్లింపులకు సిద్ధపడుతున్నారు. దాదాపుగా ప్రతి ఒక్కరి వద్దా మొబైల్ ఫోన్ ఉండటం మరొక సానుకూలత. అయితే ఈ చెల్లింపుల్లో అప్రమత్తత అవసరమని అసోచామ్ (అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా), ఎర్నెస్ట్ అండ్ యంగ్ – ఈ అండ్ వై నివేదిక స్పష్టం చేస్తోంది.