ముగిసిన మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన

0
21

రాష్ట్రంలో పెట్టుబడులకు జపాన్, కొరియా కంపెనీలు ముందుకు వచ్చాయని ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. జపాన్, దక్షిణ కొరి యా దేశాల పర్యటన ముగించుకున్న మంత్రి కేటీఆర్ బృందం శుక్రవారం హైదరాబాద్‌కు బయలుదేరిం ది. తమ పర్యటన సందర్భంగా హిటాచీ, సాఫ్ట్ బ్యాంకు, తోషిబా, సుమిటోమో, ఈసాయి కంపెనీల ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటిస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. నవంబర్‌లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు హాజరయ్యేందుకు సాఫ్ట్ బ్యాంకు సీఈవో అంగీకరించారని తెలిపారు.

టీఎస్‌ఐపాస్‌కు ప్రశంసలు..
టీఎస్‌ఐపాస్ గురించి విని అక్కడి పారిశ్రామిక వేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారని, ఇలాంటి అద్భుతమైన పాలసీ వల్ల రాష్ట్రానికి కచ్చితంగా మేలు కలుగుతుందని చెప్పారని మంత్రి తెలిపారు. జెట్రో, కీడెన్‌రాన్ జపాన్ వ్యాపార వాణిజ్య సంఘాలతో జరిపిన సమావేశాలతో వారికి రాష్ట్రం మీద మంచి అవగాహన వచ్చిందని కేటీఆర్ చెప్పారు. టోక్యో, ఒసా కా నగరాల్లో మరోసారి వాణిజ్య సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. మన టీ హబ్, టాస్క్ సంస్థలతో జపాన్ కంపెనీలు కలిసి పనిచేయబోతున్నాయని వివరించారు. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఫార్మా, వైద్య పరికరాల తయారీ, మెడికల్ టూరిజం రంగాల్లో పెట్టుబడులకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. జైకాతో జరిగిన సమావేశం సంతృప్తినిచ్చిందని, రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు నిధులిచ్చేందుకు సూచనప్రాయ అంగీకారం కుదిరిందని చెప్పారు. తమ పర్యటనలో సహకరించిన కొరియా, జపాన్‌లోని భారత రాయబారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here