మిమిక్రీకి మారుపేరు నేరెళ్ల వేణుమాధవ్

0
8

ఓరుగల్లు బిడ్డ.. తెలంగాణ రత్నం.. ఓ కళకే ఊపిరిపోశారు. విశ్వవ్యాప్తం చేశారు. మిమిక్రీ అనే ప్రాచీనమైన కళకు ఓ రూపం తెచ్చి.. సరికొత్త సొబగులు అద్దారు. చివరకు దాన్ని యూనివర్సిటీ కోర్సుగా తీర్చిదిద్దారు. ఇదీ క్లుప్తంగా నేరెళ్ల వేణుమాధవ్ జీవితం. నిజానికి మిమిక్రీ కళ నాతోనే పుట్టలేదు.. నేను దానికి ఒక సిలబస్ ఇచ్చాను అని వినమ్రంగా చెప్పుకునేవారు. రామాయణంలో మాయలేడి రాముని గొంతును అనుకరించడం, మహాభారతంలో భీముడు సైరంధ్రి గొంతును అనుకరించడం మిమిక్రీయే. దీనికి స్వరవంచన అని పేరుకూడా ఉందని చెప్పారాయన. ఓసారి అమెరికాలో ప్రదర్శన ఇస్తుంటే ఒకతను వచ్చి మిమిక్రీ ఎప్పుడు పుట్టింది అని అడిగితే వెంటనే మీ దేశం పుట్టనప్పుడు అని బదులిచ్చారు వేణుమాధవ్. చిన్నప్పుడు వాళ్లనూవీళ్లనూ సరదాగా అనుకరించడంతో మొదలైన ఆయన ధ్వన్యనుకరణ ప్రజ్ఞ విశ్వవ్యాప్తమైంది. చిన్నతనంలో చిత్తూరు నాగయ్య నటించిన భక్తపోతన చిత్రం చూసిన నేరెళ్ల వేణుమాధవ్ ఆయనకు ఫ్యాన్‌గా మారారు. నాగయ్య గొంతుతో పోతన పద్యాలు, పాటలు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. భక్తపోతన చిత్రం ఆయనపై బలమైన ముద్ర వేసింది. పోతన పుట్టిన ఓరుగల్లులో పుట్టిన మట్టిబిడ్డగా వేణుమాధవ్ తన గళం బలంతో ప్రపంచాన్ని శాసించారు.

LEAVE A REPLY