మా జీతాల నుంచే పింఛన్లా?

0
24

ఉద్యోగుల జీతాల నుంచి పింఛన్లు ఇస్తామనడం సమంజసం కాదని తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్‌ తెలిపారు. గురువారమిక్కడ జంతర్‌మంతర్‌ వద్ద కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను వ్యతిరేకిస్తూ 29 రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సహా అన్ని విపక్ష పార్టీలు పింఛను నూతన విధానాన్ని ఉపసంహరించుకొనేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలభారత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు లీలావత్‌ డిమాండు చేశారు. ధర్నాలో దేవీప్రసాద్‌ మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండు చేశారు. సీపీఎస్‌ రద్దుకు తెలంగాణ ప్రభుత్వం మద్దతిస్తోందన్నారు. ఉద్యమ నాయకుడిగా సీఎం కేసీఆర్‌ మార్గంలో నడుస్తున్నామన్నారు. పార్లమెంటులో సవరణ బిల్లు తెచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో సీపీఎస్‌ను వ్యతిరేకించే వారికే మద్దతు ఇస్తామని దేవీప్రసాద్‌ స్పష్టం చేశారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఛైర్మన్‌ శ్రీనివాసగౌడ్‌ పాల్గొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన సుమారు 2వేల మంది ఉద్యోగులు ‘‘పింఛను బిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు’’ తదితర ప్లకార్డులు ప్రదర్శించారు.

ప్రధాని, జైట్లీలతో చర్చిస్తా: దత్తాత్రేయ
కాంట్రిబ్యూటరీ పింఛను విధానా(సీపీఎస్‌)న్ని రద్దుచేయాలని అన్ని వైపుల నుంచి డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీలతో చర్చిస్తానని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. గురువారమిక్కడ టీజీవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి కార్మికశాఖ అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులతో సమావేశమై పలు అంశాలు చర్చించినట్లు తెలిపారు. సీపీఎస్‌ విధానం వల్ల వచ్చే ఇబ్బందులను శ్రీనివాస్‌గౌడ్‌ బృందం అధికారులకు వివరించిందన్నారు. అందరికీ సామాజిక భద్రత కల్పించాలన్నదే మోదీ సర్కారు లక్ష్యమని, ఆ దిశగానే ముందుకెళుతున్నామని దత్తాత్రేయ చెప్పారు. బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో ఉద్యోగులు సామాజిక భద్రత కోరుతున్నారన్నారు. సీపీఎస్‌ రద్దుపై ఆర్థికమంత్రి జైట్లీతో చర్చిస్తానని, అవసరమైతే ప్రధానితో కూడా మాట్లాడతానని తెలిపారు. 2004 నుంచి సీపీఎస్‌ విధానం అమలులో ఉందని, పదవీ విరమణ చేశాక భద్రత లేకపోవడం ఉద్యోగులకు ఇబ్బందికరమేనని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత జోనల్‌, జిల్లా, రాష్ట్ర స్థాయి కేడర్‌ల అంశంపై సమీక్షించి ఎక్కడివారిని అక్కడికి పంపే అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చిస్తానని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైతే చిన్నచిన్న అంశాలు వెంటనే పరిష్కారమవుతాయని దత్తాత్రేయ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here