మా అమ్మాయీ అదే పాట పాడుతోంది

0
28

‘‘లక్ష్మీ బాంబ్‌’ కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే హారర్‌ కామెడీ థ్రిల్లర్‌. ఇందులో రెండు రకాల పాత్రలు చేశా. న్యాయమూర్తిగా ఓ పాత్రలో కనిపిస్తా. తనకు అన్యాయం చేసిన వారిపై లక్ష్మీబాంబ్‌లా పేలుతూ ప్రతీకారం తీర్చుకునే పాత్ర మరోటి’’ అన్నారు మంచు లక్ష్మీప్రసన్న. ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్‌’. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడు. వేళ్ళ మౌనికా చంద్రశేఖర్‌, గుంజా ఉమా లక్మీ నరసింహ నిర్మాతలు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో లక్ష్మీ ప్రసన్న విలేకర్లతో మాట్లాడారు. ‘‘పతాక దృశ్యాలు, ఆ సందర్భంలో వచ్చే పాట, సోదరుడు మనోజ్‌ కంపోజ్‌ చేసిన పోరాటాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. రెండు పాత్రల్లో వ్యత్యాసం కనిపించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. బరువు కూడా తగ్గాను. ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభించింది. పాటలూ అందరికీ నచ్చాయి. మా అమ్మాయి విద్యానిర్వాణ కూడా భం…భం అంటూ ఈ సినిమాలో పాట పాడుతోంది. ఓ పాటలో ఆదిశక్తి రూపంలో కూడా కనిపిస్తా’’ అన్నారు. తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా తర్వాత మంచి కథాబలం ఉన్న ఓ చిత్రాన్ని చేస్తున్నాను. మేలో ప్రారంభం అవుతుంది. చిత్రీకరణ అమెరికాలో జరగుతుంది. నా దృష్టిలో స్త్రీ, పురుషులు సమానమే. వ్యత్యాసాలు లేవు. అలాంటప్పుడు ప్రత్యేకంగా మహిళా దినోత్సవం అనేది అనవసరం అని నా అభిప్రాయం’’ అన్నారామె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here