మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో భారీస్థాయిలో తీర్చిదిద్దిన సెట్లో మహేష్‌పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సెట్లోకి అనుకోకుండా ప్రముఖ కథానాయకుడు చిరంజీవి అడుగుపెట్టారు. దాంతో అక్కడి వాతావరణం సందడిగా మారింది. చిరంజీవిని మహేష్ ఆత్మీయంగా సెట్లోకి ఆహ్వానించారు. మహేష్, మురుగదాస్‌లతో చిరంజీవి సెట్లో చాలాసేపు ముచ్చటించారు. చిరంజీవి, మహేష్, మురుగదాస్‌లు సెట్లో ఉన్నప్పటి క్షణాలను ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ క్లిక్‌మనిపించారు. ఆయన ఆ ఫొటోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘మా సెట్‌కి ఎవరొచ్చారో చూడండి’ అంటూ మురుగదాస్ ఆ ఫొటోని ట్విట్టర్లో షేర్ చేశారు. చిరంజీవి ఇదివరకు మురుగదాస్ దర్శకత్వంలో ‘స్టాలిన్’లో నటించారు.