మళ్లీ గెలుపు బాటలో..

0
30

ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో వరుసగా రెండు పరాజయాల అనంతరం హైదరాబాద్‌ హంటర్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. శనివారం జరిగిన తమ నాలుగో మ్యాచ్‌లో హంటర్స్‌ 4-3తో ఆతిథ్య బెంగళూరు బ్లాస్టర్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. మిక్స్‌డ్‌లో కరోలినా మారిన్‌, మహిళల సింగిల్స్‌లో అశ్విని పొన్నప్ప బరిలోకిదిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకున్న చివరిదైన మహిళల సింగిల్స్‌లో మారిన్‌ 9-11, 11-5, 11-8తో పొన్నప్పపై పోరాడి గెలిచి హైదరాబాద్‌ను గట్టెక్కించింది. డబుల్స్‌, మిక్స్‌డ్‌ ప్లేయర్‌ అయిన అశ్విని సొంతగడ్డపై పోరులో సింగిల్స్‌ బరిలోకి దిగి ఆకట్టుకుంది. అంతకుముందు పురుషుల సింగిల్స్‌లో హంటర్స్‌ ప్లేయర్‌ సమీర్‌ వర్మ 11-7, 11-8తో బూన్‌సక్‌ పొన్సానాపై నెగ్గి జట్టుకు శుభారంభం అందించాడు. కానీ, మిక్స్‌డ్‌లో సాత్విక్‌ సాయి రాజ్‌తో బరిలోకి దిగిన మారిన్‌ 9-11, 7-11తో సంగ్‌ హ్యున్‌-సిక్కిరెడ్డి ద్వయం చేతిలో ఓడింది. ఇక, తమ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకున్న పురుషుల రెండో సింగిల్స్‌లో బెంగళూరు ప్లేయర్‌ అక్సెల్సెన్‌ 11-6, 11-5తో సాయి ప్రణీతపై నెగ్గడంతో ఆతిథ్య జట్టు 3-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో పురుషుల డబుల్స్‌లో హంటర్స్‌ జంట టాన్‌ బూన్‌-వీ కొయింగ్‌ 5-11, 13-11, 11-8తో హ్యున్‌-సియంగ్‌పై గెలిచి జట్టును 2-3తో రేసులో నిలిపారు. 4 మ్యాచ్‌ల అనంతరం హైదరాబాద్‌ 9 పాయింట్లతో మూడో స్థానానికి చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here